'1940లో..' చిత్రానికి జాతీయం
తెలుగు సినిమా జాతీయ కేతనం ఎగురవేసింది. 2008 సంవత్సరానికి గాను శనివారంనాడు ప్రకటించిన 56వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా '1940లో ఒక గ్రామం' జాతీయ అవార్డు దక్కించుకుంది. ఇదే సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నంది అవార్డు ప్రకటించడం విశేషం. శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా పతాకంపై నందిరెడ్డి నరిసింహా రెడ్డి, జువ్విసెట్టి శ్రీరావమ్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా నరసింహ నంది దర్శకుడుగా పరిచయమయ్యారు.
బాలాదిత్య, శ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో రాళ్లపల్లి, ముక్కురాజు, రామకృష్ణ, రజిత, శ్రీలత, సాయి లక్ష్మి తదితరులు నటించారు. సాకేత్ సాయిరాం సంగీతం అందించారు. ఈ చిత్రం కమర్షియల్ గా సరైన సక్సెస్ అందుకోనప్పటికీ చక్కటి విలువలతో, సామాజిక అంశాలను ప్రతిబిబించే చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రఖ్యాత రచయిత గురజాడ అప్పారావు రాసిన 'ఘోష' అనే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నరసింహ నది తెరకెక్కించారు. 1940లో భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సాంప్రదాయ విలువలకు అద్దంపట్టే విధంగా ఈ చిత్రం రూపొందింది. సముద్రానికి దగ్గరగా ఉండే ఓ గ్రామాన్ని ఎంచుకుని చిత్రీకరణ జరిపారు. ఆనాటి కుల, మత ఘర్షణలు, మహిళలకు స్వేచ్ఛ లోపించడం వంటి సున్నిత అంశాలతో ఈ చిత్ర కథ అల్లుకుంది. గ్రామీణ కట్టుబాట్లకు భిన్నంగా ఓ ప్రేమజంట తమ ప్రేమను పండించుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆ జంటను బలవంతంగా ఇళ్ల నుంచి వెళ్లకొట్టి, శిరోముండనం చేస్తారు. ప్రేమజంటగా నటించిన శ్రీ, బాలాదిత్య నిజంగానే ఈ చిత్రం కోసం శిరోముండనం చేయించుకుని వృత్తి పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు. తమ చిత్రానికి రాష్ట్ర అవార్డుతో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు రావడం పట్ల చిత్ర నిర్మాతలు, దర్శకుడు నరసింహ నంది సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులను ప్రకటించిన కేంద్రానికి, ఎంపిక చేసిన అవార్డు కమిటీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Be first to comment on this News / Article!
|