లతకు అక్కినేని అవార్డు
ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కు ప్రతిష్ఠాత్మక అక్కినేని అవార్డు వరించింది. సినీరంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చెందిన అక్కినేని అవార్డును ప్రదానం చేస్తుంటారు. 2009 సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ కు ఈ అవార్డును అక్కినేని స్వయంగా ప్రకటించారు. తొలి నాలుగేళ్లు అవార్డు అందుకున్న వారిలో దేవానంద్, షబానా అజ్మీ, అంజలీదేవి, వైజయంతీమాల ఉన్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో అక్కినేని ఈ అవార్డును ప్రకటించారు.
వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారికి ఏటా ఈ అవార్డును ప్రకటించి 4 లక్షల నగదు బహూకరిస్తున్నామనీ, నైటింగేల్ లతామంగేష్కర్ ను ఈ ఏడాది ఎంపిక చేశామనీ చెప్పారు. నాగార్జున స్టేట్స్ లో ఉండటం, వెంకట్ వైజాగ్ లో ఉండటంతో వారు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపారు. గత ఏడాదే లతా మంగేష్కర్ కు ఈ అవార్డు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల సాధ్యం కాలేదనీ, దాంతో వైజయంతీమాలను ఎంపిక చేశామనీ అన్నారు. జాతీయ అవార్డు అంటేనే ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా బహుమతి ప్రతిభ చూపిన వారిని, వయసు, ఆరోగ్య పరిస్థితి వంటివి పరిగణనలోకి తీసుకుని సహజంగా ఎంపిక జరుగుతుందనీ, అదే ప్రక్రియలో ఈ అవార్డుకు కూడా కమిటీ ఎంపిక జరుపుతుందనీ అక్కినేని వివరించారు. అవార్డుల ఎంపిక కమిటీ అధ్యక్షుడుగా టి.సుబ్బరామిరెడ్డి, సభ్యులుగా డి.రామానాయుడు, బోనీకపూర్, ట్రస్ట్ కమిటీ చైర్మన్ గా అక్కినేని వెంకట్ వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో లతా మంగేష్కర్ కు అవార్డు ప్రధానం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారనీ, కేంద్ర మంత్రి విలాశరావ్ దేశముఖ్ తదితర ప్రముఖులు హాజరవుతారనీ తెలిపారు.
Be first to comment on this News / Article!
|