'సింహా' సెంటిమెంట్!
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. వంశీకి గోదావరి సెంటిమెంట్ ఉండే, దిల్ రాజు తన సినిమాల్లో కనీసం ఒక సన్నివేశమైనా వైజాగ్ లో ప్లాన్ చేస్తుంటారు. రామానాయుడు ఏ సినిమా తీసినా తొలి ప్రింట్ తిరుమల బాలాజీ పాదాల వద్ద ఉంచి పూజలు చేయిస్తుంటారు. యువరత్న నందమూరి బాలకృష్ణకూ ఇలాంటి నమ్మకాలున్నాయి. ఆయన నరసింహ స్వామిని అమితంగా ఆరాధిస్తుంటారు. ఆయన నటించిన చిత్రం విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో షూటింగ్ జరిగితే అది పెద్ద హిట్టవుతుందని ఆయన బలంగా నమ్ముతుంటారు. ప్రస్తుతం ఆయన 'సింహా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒకటి రెండు సన్నివేశాలైనా సింహాచలం ఆలయ ఆవరణలో చిత్రీకరించాలని బాలకృష్ణ పట్టుబట్టడంతో రెండ్రోజుల క్రితం అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చిత్రీకరించారు. బాలకృష్ణ, నయనతార, సీనియర్ నటి కె.ఆర్.విజయలపై ఓ సన్నివేశాన్ని, ఆలయానికి చెందిన గజరాజు ఆయన మెడలో పూలమాల వేసే మరో దృశ్యాన్ని ఇక్కడ తీశారు.
బాలకృష్ణ రాక తెలిసిన పలువురు అభిమానులు ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యంలో తరలిరావడంతో వారిని బాలకృష్ణ అభిమానంగా పలకరించారు. ఈ చిత్రంలో తన అభిమానులను అలరించే అన్ని అంశాలు ఉంటాయనీ, చాలా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాననీ తెలిపారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, స్నేహ ఉల్లాల్, నమిత కథానాయికలు. ఆర్దర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో 'సింహా' ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Be first to comment on this News / Article!
|