'వరుడు' అదరహో!
స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ 'వరుడు' గెటప్ లో ఎలా ఉండబోతున్నాడనే సస్పెన్స్ కు కొద్దికొద్దిగా దర్శక నిర్మాతలు తెర తీస్తున్నారు. ఈ చిత్ర కథాంశాన్ని కానీ, అల్లు అర్జున్ గెటప్ ను కానీ ఇంతవరకూ సీక్రెట్ గా ఉంచిన ఫిల్మ్ మేకర్స్ సమ్మర్ కానుకగా రిలీజ్ కు సిద్ధం చేస్తుండటంతో క్రమంగా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితమే 'వరుడు'లోగోను ఆవిష్కరించారు. నూతన వధూవరులు (ముఖాలు చూపించకుండా) పాణిగ్రహణం చేసినట్టు చూపించే డిజైన్ తో ఈ లోగో రూపొందించారు. తాజాగా 'వరుడు' ఫస్ట్ లుక్ కూడా సంచలనం అయి కూర్చింది. ఇందులో పెళ్లి పీటల మీద పట్టుబట్టలతో నుదిటికి బాసికం, తలకు పాగా చుట్టిన రాజవంశీకుడి తరహా గెటప్ లో అల్లు అర్జున్, ఆమెకు ఎదురుగా బుట్టలో కూర్చున్న వధువు కనిపిస్తారు. వధువు ముఖం ఇందులో కనిపించకుండా ఉంచటం మరో సస్పెన్స్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా కొత్తమ్మాయి నటిస్తోంది. మరో సందర్భంలో వధువు ఎవరనేది రివీల్ చేస్తారని అనుకోవచ్చు.
సినిమా చాలా బాగా వచ్చిందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత డి.వి.వి.దానయ్య చెబుతున్నారు. అల్లు అర్జున్ అద్భుతమైన నటన ప్రదర్శించాడనీ, సినిమా రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరూ అతని నటన గురించి ముచ్చటించుకోవడం ఖాయమనీ గుణశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజజీవితంలోని 100 కుటుంబాలకు చెందిన వారిని ఇందులో నటింపజేయడం, అత్తున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ హీరో ఆర్య విలనీ పాత్ర పోషించగా, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ మరో కీలక పాత్ర పోషించారు. అల్లు అర్జున్ తల్లిగా సుహాసిని నటించారు. అన్ని పాటలకూ వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అందించగా, ఆర్.జి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది.
Be first to comment on this News / Article!
|