మా ఆవిడ మెచ్చింది: బ్రహ్మీ
హీరో లేని సినిమా ఉండొచ్చేమో కానీ కమెడియన్లు లేని సినిమా ఇటీవల కాలంలో కనిపించడం లేదు. ఎంత పెద్ద హీరో నటించినా సినిమాలో వినోదం లోపిస్తే ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు. జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన బ్రహ్మానందం ప్రేక్షకులను నవ్వించడమే తన ధ్యేయంగా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన టాప్ వన్ కమెడియన్ గా గిన్నెస్ రికార్డుకు వెళ్లారు. పద్మశ్రీ అందుకున్నారు. డాక్టరేట్లూ ఆయనను వరించాయి. బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తూ...అదికూడా హీరోతో సమానమైన నిడివిగల పాత్రలు ఇస్తూ... ఫిల్మ్ మేకర్స్ ఇటీవల కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. సంక్రాంతికి విడుదలైన మూడు చిత్రాల్లో రెండు బ్రహ్మానందం పూర్తి స్థాయి నిడివిగల పాత్రలు పోషించినవే కావడం విశేషం. వెంకటేష్ కథానాయకుడుగా నటించిన 'నమో వెంకటేశ' ఇందులో ఒకటి. ప్యారిస్ ప్రసాద్ గా బ్రహ్మనందం ఇందులో వెంకటేష్ తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులకు సంక్రాంతి నవ్వుల విందు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అనుభవాలను చిత్ర నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయంలో బ్రహ్మానందం బుధవారంనాడు పాత్రికేయులతో ముచ్చటించారు.
క్యూ కడుతున్న ఫ్యామిలీలు...
సంక్రాంతికి రిలీజైన 'నమో వెంకటేశ' చక్కటి ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు. సినిమా చాలా బాగుందంటూ మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఇందులో నాకు బాగా నచ్చిన సన్నివేశాల్లో మందు కొట్టిన సన్నివేశంలో హీరో మమ్మల్ని చితగ్గొడతాడు. కొందరు ఇది పాత సీన్ అనుకోవచ్చు కానీ దర్శకుడు శ్రీనువైట్ల తనదైన శైలిలో ఎంతో కామెడీగా ఈ సన్నివేశాన్ని రక్తికట్టించారు. అలాగే ఫ్యాక్షనిస్టుల ఇంట్లో హీరోయిన్ ని వెతికేందుకు నేను కూడా హీరోతో కలిసి ఒంటనిండా నూనె రాసుకుని వెళ్తాను. ఆ సన్నివేశం చిత్రీకరణకు ఎక్కువ రోజులే పట్టింది. అయితే ప్రేక్షకులు థియేటర్లలో ఈ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతెందుకు...అంతగా సినిమాలు చూడని మా ఆవిడ కూడా థియేటర్ లో ఈ సినిమా చూసి చాలా బాగుందంటూ ప్రశంసించింది.#Multi
వెంకీ టైమింగ్ గొప్పది...
వెంకటేష్ బాబుతో గతంలో 'అబ్బాయిగారు' , 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి చాలా చిత్రాలు చేశాను. ముఖ్యంగా నటనలో, సందర్భోచితమైన కామెడీ పండించండంలో ఆయన టైమింగ్ నాకెంతో బాగా నచ్చుతుంది. పెద్ద స్టార్ అయినప్పటికీ ఎక్కడా భేషజాలు లేకుండా అందరితో కలిసిపోతుంటారు. 'నమో వెంకటేశ' చిత్రంలో మా ఇద్దరి మధ్యా చక్కటి కెమిస్ట్రీ పండింది. ప్రేక్షకులు కూడా మా కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను చూసి హాయిగా నవ్వుకుంటున్నారు.
ప్లానింగ్ ఉన్న నిర్మాతలు...
కొందరు నిర్మాతలు ఎన్నో చెబుతారు. అయితే చేసేది తక్కువ. 'నమో వెంకటేశ' చిత్ర నిర్మాతలు మాత్రం అలా కాదు. చక్కటి అభిరుచితో పరిశ్రమలోకి వచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా తొలి ప్రయత్నంలోనే ఓ మంచి చిత్రాన్ని అందించారు. అది కూడా పక్కా ప్లానింగ్ తో తీసి చూపించారు. హిట్ కొట్టారు.
'సహస్రం' టార్గెట్...
ఇరవై ఐదేళ్ల సినీ కెరీర్ ను విశ్లేషించుకుంటే...850కి పైగా చిత్రాలు చేశాను. త్వరలోనే 1000 సినిమాలు పూర్తి చేస్తాననే అనుకుంటున్నాను. నా ఎదుగులకు కారకులైన ఆ భగవంతుడు, జన్మినిచ్చిన తల్లిదండ్రులు, గురువు జంధ్యాల గారు, ప్రేక్షకాభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.
గౌతమ్ పిల్లోడే...
మా అబ్బాయి గౌతమ్ 18 ఏళ్ల ప్రాయంలోనే 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రంలో హీరోగా పరిశ్రమకు వచ్చాడు. రాఘవేంద్రరావు ఆ అవకాశం ఇవ్వడంతో వెంటనే గౌతమ్ ను పరిచయం చేశాం. ఆ తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే మరీ వయసు తక్కువ కావడంతో చదువు మీదే కాన్ సంట్రేషన్ చేస్తూ వచ్చాడు. త్వరలోనే మళ్లీ గౌతమ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తాడు.
Be first to comment on this News / Article!
|