'పులి'లో శ్రియ ఐటెం
'జల్సా' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత పవన్ కల్యాణ నటించిన కొత్త చిత్రం ఏదీ 2009లో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'పులి' చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పవన్ కెరీర్ లో మంచి హిట్ గా చెప్పుకునే 'ఖుషీ' ఫేమ్ దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సింగనమల రమేష్ నిర్మాత. కొద్దిరోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. అనూహ్యంగా ఇప్పుడు ఈ టీమ్ లో అందాల నటి శ్రియ వచ్చి చేరింది. ఈ చిత్రంలో శ్రియ ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించనుంది. తెలుగులో శ్రియ పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించి చాలాకాలమే అయింది. అయితే ఆమె తమిళంలో హీరోయిన్ గా నటించిన చిత్రాలు 'మల్లన్న', 'పిస్తా' గా అనువాదరూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో మాత్రం 'దేవదాసు' , 'మున్నా', 'తులసి' చిత్రాల్లో శ్రియ స్పెషల్ సాంగ్స్ లో నర్తించి తన ఉనికిని చాటుకుంది. మరోసారి 'పులి' చిత్రంలో ఆమెపై చిత్రీకరించనున్న స్పెషల్ సాంగ్ సినిమాకి ఓ ప్రధాన హైలైట్ గా ఉండబోతోందని యూనిట్ వర్గాల కథనం.
పవన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో తీవ్రవాదాన్ని తిప్పికొట్టే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఒకటి. ఇందులో భాగంగానే నూయార్క్, ముంబై సిటీలో తీసిన కొన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కు జోడిగా నిఖిషా పటేల్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇందులో ఆమె పోలీసు సూపరింటెండెంట్ గా నటిస్తోందనీ, పవన్-నిఖిష మధ్య చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయనీ తెలుస్తోంది. కీలక పాత్రల్లో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, నాజర్, జ్యోతికృష్ణ, శరణ్యం, బ్రహ్మాజీ, కోవైసరళ, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'రంగ్ దే బసంతి', 'దేవదాస్', 'మిషన్ కాశ్మీర్' వంటి హిందీ బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా 'పులి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|