'కేడి' దర్శకుడితో మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు 'అతిథి' చిత్రం తర్వాత రెండేళ్లుగా ప్రేక్షకుల ముందుకు రాకపోయినప్పటికీ ఇకనుంచి ఏడాదికి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు ఆయన గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కలేజా' (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరో వైపు పలు కథా చర్చల్లోనూ పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు చిత్రాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో సురేందర్ రెడ్డి ('అతిథి' ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న 'మిస్టర్ పెర్ ఫెక్ట్' ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందనున్న చిత్రం మరొకటి. తాజాగా నాగార్జునతో 'కేడి' చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్న కిరణ్ సైతం మహేష్ బాబు దృష్టిని ఆకట్టుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
కిరణ్ ఇటీవల మహేష్ కు ఓ స్టోరీలైన్ వినిపించి ఆయనను ఆకట్టుకున్నారనీ, అయితే మహేష్ ఇంకా తన సమ్మతిని తెలియజేయాల్సి ఉందనీ చెబుతున్నారు. ప్రస్తుతం కిరణ్ 'కేడి' చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. స్టయిలిష్ మూవీగా ఈ చిత్రాన్ని కిరణ్ తెరకెక్కించారనీ, ఈ చిత్రంతో ఆయన టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వెళ్లడం ఖాయమనీ అంటున్నారు. అదే జరిగితే మహేష్ సినిమాకి కిరణ్
కర్చీఫ్ వేసినట్టే. ఫిబ్రవరి 12న 'కేడి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|