'గల్లీ కుర్రోళ్లు' ప్రారంభం
అనాథల జీవితాలపై కొంత రీసెర్చ్ చేసి ఒక ప్రయోజనాత్మక చిత్రంగా 'గల్లీ కుర్రోళ్లు' తెరకెక్కనుంది. దీనికి 'దేశానికి వెన్నెముకలు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకట్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగవర్మ, కీర్తిచంద్ర, మాస్టర్ పులకిత్, వంశీ, వివేక బాబు వంటి కొత్తతారలు నటిస్తున్నారు. చంద్రమోహన్, కవిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాయివెంకట్ తొలిసారి ఇందులో ఓ కీలక పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ కొత్త చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో బుధవారంనాడు ఒక పాట చిత్రీకరణతో ప్రారంభమైంది. చంద్రమోహన్, కవిత, సాయివెంకట్ లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి క్లాప్ ఇవ్వగా, లక్ష్మీపార్వతి కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకనిర్మాత వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
సాయివెంకట్ మాట్లాడుతూ, అనాథల జీవితాలకు సంబంధించి ఏడాది పాటు తాను రీసెర్చ్ చేశాననీ, ఎందరెందరినో కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకున్నాననీ చెప్పారు. సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. అనాథలు లేని సమాజం కోసం ఏం చేయాలనేది ఇందులో చూపించనున్నామనీ, తాను కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాననీ చెప్పారు. పలువురు కొత్త నటీనటులను ఇందులో పరిచయం చేస్తుండటంతో పాటు వారితో 20 ట్రైల్ షూట్స్ కూడా చేశామనీ చెప్పారు. చంద్రమోహన్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలోని ఓ బర్నింగ్ ప్రాబ్లంను ఒక ఆర్ట్ ఫిల్మ్ లా దర్శకుడు తీస్తున్నారనీ, ఇందులో మంచి పాత్ర పోషిస్తున్నాననీ చెప్పారు. చిత్ర సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ, ఇందులో ఒక థీమ్ సాంగ్ ఉందనీ, ప్రస్తుతం ఆ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందనీ చెప్పారు. మరో మూడు సాంగ్స్ కూడా ఇందులో ఉన్నాయనీ, మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాననీ అన్నారు. ఈ చిత్రాని అంజి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|