55 ప్రింట్లతో 'మాయాబజార్'
కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణి 1957లో సృష్టించిన మహాద్భుతం 'మాయాబజార్' తాజాగా కలర్ ఫుల్ గా, రంగుల హరివిల్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాటి 'మాయాబజార్'ను కలర్ లో, సినిమా స్కోప్ గా, డిటిఎస్ హంగులు జోడించి తయారు చేసిన ఈ నయా 'మాయాబజార్'ని గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ అందిస్తోంది. సూపర్ గుడ్ సంస్థ ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తోంది. మొదటగా 55 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి తెలిపారు.
గోల్డ్ స్టోన్ సంస్థ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రంగుల్లోకి తీర్చిదిద్దిందనీ, సూపర్ గుడ్ సంస్థ ద్వారా సినిమా విడుదలవుతుండటం గర్వంగా ఉందనీ ఆయన తెలిపారు. ఏడు నెలల పాటు 160 మంది తెలుగు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేసి ఈ అద్భుతాన్ని తయారు చేశారనీ, ఈ ప్రయోగం ఫలవంతమైతే ఆణిమ్యుతాల్లాంటి ఎన్నో పాత చిత్రాలను రంగుల్లో చూడవచ్చనీ అన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయనీ, కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయనీ చెప్పారు. తొలుత 55 ప్రింట్లతో రిలీస్ చేసి శివరాత్రికి మరిన్ని ప్రింట్లు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇటీవలే ఈ చిత్రాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావుకు చూపించామనీ, రంగుల్లో ఈ సినిమాను చూడడానికి నేనింతకాలం బతికి ఉన్నానేమోనని ఆయన ఎంతో సంబరపడ్డారనీ తెలిపారు. ఈ చిత్రాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావుకు అంకింతం చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావు తెలిపారు. ఇప్పటికే ఎంతోమంది ఎన్నోసార్లు ఈ చిత్రాన్ని తిలకించారనీ, మళ్లీ మళ్లీ చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నారనీ, అదే ధీమాతో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమా స్కోప్ లో డిటిఎస్ మిక్సింగ్ చేసి విడుదల చేస్తున్నామనీ తెలిపారు. గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థతో తన కుమారుడు అంజన్ కుమార్ కు ఉన్న అనుబంధంతో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం తమకు కలిగిందన్నారు.
Be first to comment on this News / Article!
|