బ్రహ్మానందం వంటి సీనియర్ ఆర్టిస్టు కూడా టేకుల్ని కేకుల్లా తినేశారంటే నమ్మశక్యం కాదు. అయినా నిజం నమ్మే తీరాలి. అది కూడా బ్రహ్మానందం చెప్పిందే కాబట్టి ఇందులో ఎలాంటి ఢోకా లేదు. 'అదుర్స్' చిత్రంలో భట్టు పాత్ర పోషించిన బ్రహ్మానందంపై ఒక సన్నివేశంలో 'తెల్లవార్లూ...' అనే డైలాగ్ తీయాల్సి వచ్చినప్పుడు సరిగ్గా 22 టేకులు చేయాల్సి వచ్చిందట.
తాను ప్రేమించిన అమ్మాయిని (నయనతార) తన శిష్యుడైన చారి (ఎన్టీఆర్) తన్నుకుపోవండంతో భట్టు అతనిపై పగబడతాడు. చారి కొద్దిరోజులపాటు తనలాగే ఉండే వేరే వ్యక్తి ప్లేస్ లోకి వెళ్లాడని తెలిసి అతని గుట్టురట్టు చేసేందుకు ముంబై వెళ్లిన భట్లు ఓ బూటకపు హత్య కేసులో ఇరుక్కుంటాడు. చనిపోయిన వ్యక్తి ఆత్మగా తనను పట్టి పీడిస్తున్నాడని తెగ బాధపడిపోతుంటాడు. ఈ క్రమంలోనే ఓ సన్నివేశం వస్తుంది. ఎన్టీఆర్ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ వాక్ మన్ లో పాటలు వింటుంటాడు. అక్కడకు వచ్చిన బ్రహ్మానందాన్ని వెనకనుంచి 'భట్టూ' అని ఎవరో పిలుస్తారు. తెల్లవార్లు నిద్ర పోనీయడం లేదురా...అంటాడు బ్రహ్మానందం. ఎవరు గురువుగారూ...అని ఎన్టీఆర్ అడుగుతాడు. 'ఆత్మరా...ఆత్మ' అని బ్రహ్మానందం తెగ బాధపడిపోతూ చెబుతాడు. ఈ సన్నివేశంలోనే 'తెల్లవార్లూ' అనే డైలాగ్ బ్రహ్మానందం చెప్పే సరికి వినాయక్ కట్ చెప్పడం మానేసి నవ్వుతూ ఉన్నారట. కెమరామన్ ఛోటా కె.నాయుడుకు అయితే లైట్ ఫెయిలయిపోతుందని తెగ కోపం వచ్చేసేది. ఈసారి మళ్లీ యాక్షన్ అనగానే...ఛోటా కెమెరా వదిలేసి నవ్వుతున్నారు. మరో సారి ఎన్టీఆర్ నవ్వులు. ఇలా ఎవరో ఒకరు నవ్వుతూ ఉండటంతో షాట్ ఓకే కావడానికి 22 టేకులు పట్టాయట. ఆ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు ప్రేక్షకుల అభినందనల రూపంలో దక్కుతుండటం ఇటు బ్రహ్మాని..అటు చిత్రయూనిట్ ను సంబరంలో ముంచెత్తుతోంది.