నెంబర్ వన్ రేసులో ఎన్టీఆర్!
హీరోల్లో నెంబర్ వన్ ఎవరనే చర్చ ఆయా సందర్భాలను బట్టి తెరపైకి వస్తుంటుంది. నటరత్న ఎన్టీఆర్ తర్వాత దాదాపు పాతికేళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవి ఆ ప్లేస్ ను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో నెంబర్ వన్ ఎవరనే ప్రశ్న ఆమధ్య తెరమీదకు వచ్చింది. నందమూరి మూడోతరం వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ ఓ దశలో నెంబర్ వన్ హీరో కావాలనుకుంటున్నానని ప్రకటించడం అప్పట్లో కొద్దిపాటి వివాదానికి తావిచ్చింది. ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన వారు కొందరైతే, నాలుగైదు సినిమాలకే ఇంత ఎగిరిపాటా అని విమర్శించిన వారూ లేకపోలేదు. ఒక సినీ పత్రిక నేరుగా మెగాస్టార్ నూ...ఎన్టీఆర్ నూ పోల్చి వార్తాకథనం రాయడంతో ఆ కార్యాలయంపై దాడి జరిగి అది మూతపడింది. ఆ తర్వాత క్రమంలో మహేష్ బాబు 'పోకిరి'తో 75 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులను తిరగరాయడం, ఆ రికార్డును ఇటీవలే 'మగధీర' క్రాస్ చేయడంతో నెంబర్ వన్ ఈక్వేషన్లు మారుతున్న సంకేతాలు కనిపించాయి. అయితే 'మగధీర' రికార్డుపై ఎన్టీఆర్ తన 'అదుర్స్' చిత్రంతో కన్నేసినట్టు వార్తా కథనాలు కూడా వినిపించాయి. ఊహించినట్టుగానే 'అదుర్స్' మంచి సక్సెస్ కావడంతో నెంబర్ వన్ చర్చ మళ్లీ ఊపందుకుంది. అయితే ఆ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ లెక్కలు, రికార్డుల వ్యవహారాలు మరో నాలుగు వారాల తర్వాత తేలుతాయి. ఇదే తరుణంలో చిత్ర విజయోత్సాహంలో ఉన్న ఎన్టీఆర్ తన తాజా ఇంటర్వ్యూలో మరోసారి నెంబర్ వన్ ప్రస్తావన చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు
'నెంబర్ వవన్ కావాలనుకోవడంలో ఎవరైనా తప్పు పట్టాల్సింది ఏముంది? ప్రతి ఒక్కరూ తమ తమ రంగంలో నెంబర్ వన్ గా ఉండాలనుకుంటారు. నేనూ అంతే. నేనుండే రంగంలో నెంబర్ వన్ కావాలన్నదే నా లక్ష్యం. నేనే నెంబర్ వన్ అని చెప్పి ఉంటే అహంకారం అనుకోవచ్చు. నేను అలా చెప్పడం లేదు. నెంబర్ వన్ అనే టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా నా ప్రయాణం సాగిస్తున్నాను' అంటూ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. ప్రమాదం తర్వాత మళ్లీ నటించగలనని అనుకోలేదనీ, 'అదుర్స్' విజయం తనకు కొత్త జన్మలో ప్రేక్షకులు అందించిన అద్భుత విజయమనీ ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'బృందావనం', 'శక్తి' చిత్రాలు సైతం ఇదే ఏడాది రిలీజ్ ను టార్గెట్ చేసుకున్నాయి. మొత్తానికి నెంబర్ వన్ లక్ష్యం మాత్రమే కాదు..ఆ దిశగా ఆయన వేగం పెంచి యువతరం హీరోలకు గట్టి సవాలు కూడా విసిరారు.
Read 7 Comment(s) posted so far on this News / Article!
|