మన్మథుడే...కంత్రీమొగుడు!
బాలీవుడ్ భామ దీపిక పడుకునే ఇంతవరకూ తెలుగు స్క్రీన్ పై కనిపించనప్పటికీ ఆమె నటించిన ఓ కన్నడ చిత్రం ఇప్పుడు తెలుగులో అనువాద రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడంలో ఆమె నటించిన 'ఐశ్వర్య' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దానినే ఇప్పుడు 'కంత్రీ మొగుడు' పేరుతో నిర్మాత రూప్ కుమార్ వి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించారు. ఇంద్రజిత్ వెంకటేష్ దర్శకత్వం వహించారు. అయితే ఇక్కడో విశేషం ఉంది. ఇది తెలుగులో నాగార్జున, సోనాలిబింద్రే, అన్షు నటించిన హిట్ చిత్రం 'మన్మథుడు' చిత్రానికి రీమేక్.
'మన్మధుడు' చిత్రం 2002లో తెలుగులో విడుదల కాగా, దానికి రీమేక్ గా 2006లో 'ఐశ్వర్య' తెరకెక్కింది. ఓరకంగా మన సినిమా మళ్లీ మరో రూపంలో మనముందుకు రాబోతోందన్నమాటే. తెలుగులో ఉపేంద్ర నటించిన పలు చిత్రాలు విజయవంతం కావడం, ఆయనకంటూ కొందరు అభిమానులు ఉండటం, దీపిక పడుకునే అందాలు 'కంత్రీమొగుడు'ను జనరంజకం చేయొచ్చని నిర్మాతల ఆలోచన కావచ్చు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|