లతకు ఎఎన్నార్ అవార్డు
భారతరత్న, గానకోకిల డాక్టర్ లతా మంగేష్కర్ కు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున అక్కినేని అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో సోమవారంనాడు జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి కె.రోశయ్య, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి విలాసరావ్ దేశ్ ముఖ్ హాజరయ్యారు. టి.సుబ్బరామిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని ఫౌండేషన్ చైర్మన్ అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సతీమణి అమల ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
లతా మంగేష్కర్ కు అవార్డు కింద 4 లక్షల రూపాయల చెక్కును అక్కినేని వెంకట్, నాగార్జున సంయుక్తంగా అందజేశారు. రోశయ్య శాలువాతో లతను సన్మానించారు. సన్మాన పత్రాన్ని టి.సుబ్బరామిరెడ్డి, మెమెంటోను విలాసరావు దేశ్ ముఖ్ అందించారు. అక్కినేని ఎంతో గొప్ప నటులనీ, ఆయన నటించిన 'దేవదాసు' చిత్రాన్ని భాష తెలియకపోయినా 10సార్లు చూసి ఆయనను ఎంతగానో అభిమానించే దాన్ననీ లత పేర్కొన్నారు. ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విలాసరావు దేశ్ ముఖ్ మాట్లాడుతూ, సంగీతానికి ఎల్లలు లేవనీ, ప్రపంచానికికంతటికీ తన సంగీతాన్ని పంచిన లతా మంగేష్కర్ భారతదేశం గర్వించదగిన గాయని అని ప్రశంసించారు. భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు ఆమె అందుకున్నారనీ, ఇప్పుడు ఈ అవార్డు ఆమెకు రావడం చాలా అనందంగా ఉందనీ అన్నారు. సంగీతం ద్వారా ఎన్నో వ్యాధులు పోతాయనీ, జీవనప్రమాణం పెరుగుతుందనీ చెబుతారనీ, లత పాటకు ఉన్న పవర్ అలాంటిదనీ అన్నారు. ఇదే సందర్భంలో వరద బాధితుల సహాయార్థం బిహెచ్ఇఎల్ కంపెనీ వారు 5 కోట్ల రూపాయల సహాయం ప్రకటించి తొలి విడతగా అందించిన 2.5 కోట్ల రూపాయల చెక్ ను రోశయ్యకు కేంద్ర మంత్రి అందజేశారు. అలాగే శ్రీకాళహస్తి దగ్గర్లోని మన్నవరం వద్ద ఎన్టీపిసి, బిహెచ్ఇఎల్ కంపెనీ తలపెట్టిన పరిశ్రమకు త్వరలోనే శంకుస్థాపన జరుపుతామని దేశ్ ముఖ్ ప్రకటించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|