'గోలీమార్'పై అటాక్!
సినీ షూటింగ్ లపై ఇటీవల జరిగిన దాడులు సద్దుమణిగి మళ్లీ ప్రశాంత వాతావరణం ఏర్పడిందని అంతా అనుకుంటున్న తరుణంలో తిరిగి తెలంగాణ ఉద్యమకారులు 'గోలీమార్' చిత్రం షూటింగ్ పై సోమవారంనాడు దాడికి దిగారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ చివర్లో ప్రారంభమైన ఈ చిత్రం కొద్దిరోజులుగా శరవేగంగా షూటంగ్ జరుపుకొంటోంది. ప్రస్తుతం షూటింగ్ కూకట్ పల్లిలోని రైతు బజార్ లో జరుగుతుండగా పలువురు తెలంగాణవాదులు ఆ ప్రాంతానికి చేరుకుని షూటింగ్ నిలిపివేయాలంటూ హంగామా సృష్టించారు. ఈ సమాచారం అందడంతో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే సినిమా షూటింగ్ కు తాము భద్రత కల్పించలేమని పోలీసులు ఓ దశలో తేల్చిచెప్పడంతో చిత్ర యూనిట్ పేకప్ చెప్పి షూటింగ్ రద్దు చేసుకుంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న నటి రోజా సైతం దాడి జరగవచ్చనే అభిప్రాయంతో అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
షూటింగ్ కు తాము పర్మిషన్ తీసుకున్నామనీ, అయితే ఇలాంటి ప్రతిఘటన ఎదురవుతుందని తాము అనుకోలేదనీ ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ తెలిపారు. నటి రోజా ఈ సంఘటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు వాంఛనీయం కాదనీ, తమ డిమాండ్లు సాధించుకోవాలంటే అందుకు వేరే వేదికలు ఉన్నాయనీ అన్యాపదేశంగా తెలంగాణ వాదులకు సూచించారు. ముంబై ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ స్ఫూర్తితో 'గోలీమార్' తెరకెక్కుతోంది.
Be first to comment on this News / Article!
|