'యుగానికి ఒక్కడు' ముస్తాబు
తమిళంలో ఇటీవలే విడుదలైన 'ఆయరత్తిల్ ఒరువన్' చిత్రం తెలుగులో 'యుగానికి ఒక్కడు' పేరుతో అనువాదమై ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తి, రీమాసేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వ్యాలి కార్పొరేషన్ స్టూడియో గ్రీన్ వారు నిర్మించారు. శ్రీ రాఘువ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర వివరాలను ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్రయూనిట్ తెలియజేసింది. కార్తి, రీమాసేన్, శ్రీరాఘవ పాల్గొన్నారు.
తొలుత కార్తి మాట్లాడుతూ, తమిళంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా నడుస్తోందని, ఈనెల 5న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందనీ చెప్పారు. ఈ చిత్రం కోసం రెండేళ్ల పాటు శ్రమించామనీ, ఇందులో తాను డీగ్లామరైజ్డ్ పాత్ర పోషించాననీ అన్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాను కొంత ట్రిమ్ చేశామనీ, ఈ చిత్రం ద్వారా హీరోగా తనను ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. రీమాసేన్ మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం మిగిలిన సినిమాలు కూడా వదులుకుని రెండేళ్ల పాటు పనిచేసినట్టు తెలిపారు. ఇంతవరకూ తాను చేసిన సినిమాలన్నింటిలోకి ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అని అన్నారు. శ్రీరాఘవ మాట్లాడుతూ, రెండేళ్ల కష్టం ప్రతి సీన్ లోనూ కనిపిస్తోందంటూ ప్రేక్షకులు ఈ సినిమాని మెచ్చుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని రూపొందించామనీ, చోళుల కాలం నాటి విషయాలను రీసెర్చ్ చేసి మరీ ఇందులో చూపించామనీ అన్నారు. తెలుగు వెర్షన్ కోసం సుమారు 45 నిమిషాలు సినిమాను ట్రిమ్ చేసినట్టు చెప్పారు. తాము చేసిన ఈ మంచి ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|