11న వస్తున్న 'లీడర్'
రాజకీయ ఇతివృత్తంతో తన గత చిత్రాలకు భిన్నంగా 'లీడర్'ను తెరకెక్కించినట్టు చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. డాక్టర్ డి.రామానాయుడు మనవడు రానాను హీరోగా పరిచయం చేస్తూ ఎవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో శేఖర్ కమ్ముల ఆ వివరాలు తెలియజేశారు.
ప్రజలు కలలు కనే లీడర్ ఎలా ఉండాలనే అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించామనీ, వ్యవస్థలోని పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదనీ శేఖర్ కమ్ముల తెలిపారు. సెన్సార్ పూర్తయి కొద్దిరోజులు గడిచినప్పటికీ సరైన సమయంలో విడుదల చేసేందుకు ఇన్నిరోజులు ఆగామనీ చెప్పారు. ఈనెల 11న సినిమా విడుదలవుతుందని తెలిపారు. రానా కొత్త హీరో అయినప్పటికీ తొలిచిత్రంలోనే చక్కటి నటన కనబరచాడనీ, తనకు అన్నివిధాలా సంతోషాన్ని కలిగించిందని చిత్రమిదనీ చెప్పారు. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ, ఛాలెంజ్ గా ఈ చిత్రం చేశాననీ, చాలా మంచి అల్బమ్ కుదిరిందనీ తెలిపారు. ఎడిటిర్ గా తాను పలు చిత్రాలకు పనిచేసినప్పటికీ టాప్-5లో 'లీడర్' కూడా ఉంటుందని ఎడిటిర్ మార్తాండ్ కె.వెంకటేష్ పేర్కొన్నారు. సబ్జెక్ట్ కు తగిన ఛాయాగ్రహణం సమకూర్చినట్టు విజయ్ సి.కుమార్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి, సుమన్, ఆహుతి ప్రసాద్, సుహాసిని, హర్షవర్దన్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రావురమేష్ తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం శేఖర్ కమ్ముల సమకూర్చిన ఈ చిత్రానికి వేటూరి పాటలు అందించారు. ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణ గుహన్ నిర్మాతలు.
Be first to comment on this News / Article!
|