విజయభాస్కర్ తో పవన్
పవన్ కల్యాణ్ నటించిన ఒక్క చిత్రం కూడా 2009లో రిలీజ్ కు నోచుకోకపోయినా ఈ ఏడాది సమ్మర్ కానుకగా 'పులి' విడుదలకు సిద్ధమవుతోంది. సుమారు ఓ పదేళ్ల క్రితం పవన్ తో 'ఖుషి' వంటి సెన్సేషన్ హిట్ ను ఇచ్చిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందడంతో సహజంగానే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత పవన్ తదుపరి చిత్రం ఏమై ఉంటుందనేది కొంత సస్పెన్స్ గానే ఉన్నప్పటికీ ముందుగా కమిట్ అయిన ప్రకారమే నటుడు గణేష్ బాబు నిర్మించనున్న చిత్రం సెట్స్ పైకి తేచ్చెందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి తొలుత దర్శకుడుగా హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) పేరును గణేష్ బాబు ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆ ప్లేస్ లో కె.విజయభాస్కర్ వచ్చి చేరారు. హరీష్ తాజాగా రవితేజ కొత్త చిత్రం వైపు మళ్లడంతో ఈ మార్పు అనివార్యమైంది. ఆసక్తికరంగా ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ-మాటలు అందించబోతున్నారు.
దర్శకుడుగా విజయభాస్కర్ , కథకుడు-మాటల రచయితగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'నువ్వేకావాలి', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడుగా బిజీ అయ్యారు. ఆ క్రమంలో విజయభాస్కర్ ఇటీవల దర్శకత్వం వహించిన 'భలే దొంగలు' ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి పనిచేసేందుకు విజయభాస్కర్ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఇద్దర్నీ కలపడం ద్వారా గణేష్ బాబు ఎలాగైనా తన బ్యానర్ లో ఓ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. గణేష్ బాబు ఈమధ్యనే రవితేజతో 'ఆంజనేయులు' చిత్రం నిర్మించారు. పవన్-విజయ భాస్కర్ కాంబినేషన్ చిత్రం ఈ సమ్మర్ లోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|