'కేడీ'తో 'లీడర్' ఢీ!
పెద్ద సినిమాల మధ్య పోటీలేకుండా కనీసం వారం, పది రోజులు గ్యాప్ పాటిస్తూ వస్తున్న ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు తమ రూల్స్ ను సడలించుకోక తప్పడం లేదు. దీంతో ఈ నెలలో ఇంచుమించు ఏకకాలంగా పలు చిత్రాలు ముఖాముఖీ, ద్విముఖ-త్రిముఖ పోటీని కూడా ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ, ప్రత్యేకాంధ్ర ఆందోళనల నేపథ్యంలో విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వచ్చిన పలు చిత్రాలు మార్చిలో పరీక్షల సీజన్ కావడంతో ఫిబ్రవరి రిలీజ్ లకు రెడీ అవుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని కొద్దికాలంగా విడుదలకు ఎదురు చూస్తున్న శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం ఎట్టకేలకు ఈనెల 11న రిలీజ్ అవుతోంది. నేటి రాజకీయాల్లో సరైన నాయకుడు ఎలా ఉండాలనే అంశాన్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని నిబద్ధతతో శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. తమ చిత్రం విడుదలలో జాప్యం జరిగినప్పటికీ ఎప్పుడు థియేటర్లకు చేరినా ఇక తిరిగి తీసుకునే అవసరం రాదంటూ 'లీడర్' చిత్ర విజయంపై శేఖర్ కమ్ముల థీమాగా ఉన్నారు. డాక్టర్ డి.రామానాయుడు మనవడు రానా ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండటం, ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇదే తరుణంలో 'లీడర్' చిత్రం అక్కినేని నాగార్జున 'కేడి'ని ఢీకొంటుండటం సినీగోయెర్స్ ను ఆకర్షిస్తోంది.
నాగార్జున కథానాయకుడుగా కిరణ్ దర్శకత్వంలో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'కేడి' చిత్రం ఈనెల 12న రీలీజ్ కు సిద్ధమవుతోంది. నిజానికి నాగార్జునకు ఉన్న సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని రీలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అది సాధ్యం కాలేదు. సంక్రాంతి సీజన్ సైతం ముగిసిన తరుణంలో 'కేడి' ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో 'లీడర్' చిత్రం ఏమేరకు 'కేడీ'ని ఎదుర్కొంటుందనేది పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నట్టు...నిఖిల్-శ్వేతబసు ప్రసాద్ జంటగా నటించిన 'కళవర్ కింగ్', శివాజీ హీరోగా నటిస్తూ తొలిసారి నిర్మించిన 'తాజ్ మహల్' చిత్రాలు కూడా 12వ తేదీనే విడుదలవుతున్నాయి.
Be first to comment on this News / Article!
|