సాయిరాం చిత్రంలో అక్కినేని
'బంపర్ ఆఫర్' చిత్రంతో గత ఏడాది మంచి సక్సెస్ సాధించిన సాయిరాం శంకర్ మరో భారీ చిత్రంలో కథానాయకుడుగా నటించబోతున్నారు. ఇందులో ఓ కీలక పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పోషించున్నారు. 'శ్రీరామదాసు' చిత్రం తర్వాత అక్కినేని నటించనున్న చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ తాజా చిత్రం వివరాలను సాయిరాం శంకర్ తెలియజేస్తూ, 'బంపర్ ఆఫర్' తర్వాత మరో మంచి సబ్జెక్ట్ తో ఈ చిత్రం చేస్తున్నాననీ, ఇందులో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ చెప్పారు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ఓ కీలక పాత్రను పోషించన్నారనీ, మరో ముఖ్య పాత్రలో ఓ ప్రముఖ నటుడు నటిస్తారనీ తెలిపారు. తన సోదరుడు పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ శాఖలో మంచి అనుభవం గడించిన అశోక కుమార్ లాలమ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారనీ, ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారనీ చెప్పారు. టాప్ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రంలో తాను హీరోగా నటించడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఉగాదికి షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ కథ, పరుచూరి సోదరులు సంభాషణలు, ఎస్.గోపాలరెడ్డి సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|