10 యుఎస్ ప్రింట్లతో 'బిందాస్'
కొత్తతరం హీరోల్లో వైవిధ్యమైన పాత్రల పోషణకు ముందుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న మంచు మనోజ్ 'బిందాస్' (అజయ్ గాడి విజయ గాథ) చిత్రంతో ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మనోజ్ కెరీర్ లోనే తొలిసారి అమెరికాలో ఈ చిత్రం 10 ప్రింట్లతో విడుదలవుతోంది. ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మమించిన ఈ చిత్రం ద్వారా రచయిత వీరుపోట్ల తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మనోజ్ కు జోడిగా షీనా తొలిసారి తెలుగులో నటిస్తోంది.
'దిస్ ఈజ్ నాట్ ఎ లవ్ స్టోరీ...దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ లవ్' అని దర్శకుడు వీరుపోట్ల తెలిపారు. మనల్ని ఇష్టపడిన వారిని ఇష్టపడటం మంచితనమైతే, మనల్ని ఇష్టపడని వారిని కూడా ఇష్టపడటం గొప్పతనమనీ, ఆ గొప్పతనం ఈ చిత్రంలోని కథానాయకుని పాత్రలో కనిపిస్తుందనీ ఆయన చెప్పారు. ప్రేక్షకులు సరికొత్త మనోజ్ ను ఇందులో చూస్తారనీ, మనోజ్ నుంచి ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని తెలిపారు. అలాగే బోబో శశి అందించిన సంగీతానికి ఇప్పటికే చాలా మంచి స్పందన వచ్చిందనీ, సినిమా సైతం ఇంటిల్లిపాదీ చూసి ఆనందించే విధంగా ఉంటుందనీ అన్నారు. ఇదొక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సుంకర రామబ్రహ్మం తెలిపారు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారనీ, ముఖ్యంగా డూప్ లేకుండా మనోజ్ చేసిన ఫైట్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అవుతుందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, సుబ్బరాజు, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం వీరు పోట్ల అందిస్తున్న ఈ చిత్రానికి రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|