7 లక్షలతో క్లినిక్: రాజశేఖర్
డాక్టర్ కావాలనుకుని డాక్టర్, యాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాననీ, అందరికీ వైద్యం అందించాలనే తపన మాత్రం తనను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉందనీ ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. తన ఆలోచనకు కార్యరూపంగా సినిమా వాళ్ల కోసం ఒక 'ఫ్రీ క్లినిక్'ను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. ఈనెల 4న రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో శ్రీమతి జీవితా రాజశేఖర్ తో కలిసి పాత్రికేయులతో బుధవారంనాడు ముచ్చటించారు. బర్త్ డే నిర్ణయాలు, తుదుపరి చిత్రాలు, సేవాకార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
అందరికీ వైద్యం...
సినిమాల్లోకి వచ్చినా మొదట్నించీ ఎంబిబిఎస్ డాక్టర్ గా చేతనైన వైద్య సేవలు అందిస్తూ వస్తున్నాను. అందరికీ మంచి వైద్యం అందించాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్టుల వారు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రేయింబవళ్లు కష్టపడుతుంటారు. కొందరు వైద్యసేవలకు ఖర్చు చేయలేని స్థితిలో కూడా ఉంటారు. వారందరికీ ఉచిత వైద్యం అందించేందుకు 'ఫ్రీ క్లినిక్' ఏర్పాటు ఆలోచన చాలా కాలంగా ఉంది. అది ఇప్పుడు కార్యరూపంలోకి రాబోతోంది. ఇందుకోసం ఫిల్మ్ నగర్ సొసైటీ కాంప్లెక్స్ లో క్లినిక్ కు జాగా ఇవ్వాలని ఒక వినతిపత్రం కూడా అందజేశాను. సొసైటీ వారు అందుకు సానుకూలంగా స్పందించారు. అక్కడే క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాం. ఒక డాక్టర్ ఉదయం, సాయంత్రం సినిమా వాళ్లకు అందుబాటులో ఉంటారు. ఈమధ్యనే జెమినీ టీవీలో సాయికుమార్ 'డీల్ ఆర్ నో డోల్' లో నేనూ, జీవిత పాల్గొని 10 లక్షలు గెలుచుకున్నాం. 3 లక్షలు టాక్స్ కు పోగా 7 లక్షలు చేతికి వచ్చాయి. ఆ మొత్తాన్ని 'ఫ్రీ క్లినిక్'కు కేటాయిస్తున్నాం. ఇది నా బర్త్ డే స్పెషల్ గా అనుకోవచ్చు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది బర్త్ డేకు కూడా అనాథ శరణాలయాల్లో పిల్లలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఛారిటీ కార్యక్రమాలు ఉంటాయి.
మెడిసన్ స్టడీస్...
ఎంబిబిఎస్ చేసినప్పటికీ మరింత ఉన్నత వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నాను. ఇందులో భాగంగానే లండన్ కాలేజీ ఆఫ్ హోమియోపతిలో ఆల్టర్నేటివ్ కోర్సులు చేయబోతున్నాను. ఇందువల్ల నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2-
|