'ఏమాయ చేసావె' పాటలు
నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం 'ఏమాయ చేసావె'. సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్, గ్రామీ అవార్డుల విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో బుధవారంనాడు నేరుగా మార్కెట్ లోకి విడుదల చేశారు.
నాగచైతన్య మాట్లాడుతూ, ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారనీ, నిజజీవితానికి దగ్గరగా ఉండే ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందనీ చెప్పారు. తన ఫేవరెట్ సంగీత దర్శకుడు, అకాడమీ అవార్డ్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం, తనకెంతో ఇష్టమైన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో హీరోగా నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఇద్దరితో కలిసి పనిచేయాలనే కోరిక తన రెండో చిత్రానికే తీరడం మరచిపోలేనని అన్నారు. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ, రెహ్మాన్ తో తనకిది తొలి చిత్రమనీ, ఆయనతో పనిచేయడం చాలా ధ్రిల్ కు గురిచేసిందనీ చెప్పారు. అలాగే నాగచైతన్య తన తాత, తండ్రికి తగ్గట్టుగా అద్భుతమైన నటుడని ప్రశంసించారు. ఆస్కార్, గ్రామీ అవార్డుల విజేత రెహ్మాన్ ఈ చిత్రానికి 7 అద్భుతమైన పాటలు కంపోజ్ చేశారని మంజుల తెలిపారు. సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ, గౌతమ్ మంచి టెక్నిషియన్ అనీ, రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడితో సినిమా చేయడం తమ అదృష్టమనీ అన్నారు. నాగచైతన్య చాలా పెద్ద హీరో అవుతారని జోస్యం చెప్పారు. ఆడియోతో పాటు సినిమా కూడా సంచలన విజయ సాధిస్తుందనే నమ్మకం తమకుందన్నారు.
Be first to comment on this News / Article!
|