'లీడర్'కు లీగల్ చిక్కు?
దగ్గుబాటి రాణా 'లీడర్' చిత్రం కొద్దికాలం క్రితమే సెన్సార్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడం, 'హ్యాపీడేస్' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దగ్గుబాటి అభిమానుల నిరీక్షణకు దర్శక నిర్మాతలు ఎట్టకేలకు తెరదించుతూ ఈనెల 11న విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే అనుకున్నది అనుకున్నట్టుగా ఆ రోజుకైనా 'లీడర్' వెలుగుచూస్తాడా అనేది ఇప్పుడు సందేహంగా మారిందని అంటున్నారు. తన స్టోరీలైన్ ను శేఖర్ కమ్ముల కాపీ చేశారంటూ రచయిత శివ కోర్టును ఆశ్రయించారు.
'ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి స్థాయికి ఎలాగ ఎదిగాడన్నదే ఈ స్టోరీ. ఇది బేసిక్ గా నేను రాసుకున్న స్టోరీ లైన్. దీనిపై రైటర్స్ గిల్డ్ కు కూడా ఫిర్యాదు చేశాను. ప్రయోజనం లేకపోయింది. దీంతో న్యాయపోరాటమే శరణ్యమైంది' అని శివ తెలిపారు. అయితే ఈ కథ పూర్తిగా తనదేననీ, తానే స్క్రిప్టు రచన చేశాననీ శేఖర్ కమ్ముల ఇటీవలే రచయితల సంఘానికి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం శివ చెబుతున్న లీగల్ కేసు నుంచి 'లీడర్' బయటపడి 11న ప్రేక్షకుల ముందుకు వస్తాడా, మరో వాయిదా తీసుకుంటాడా అనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|