రాజశేఖర్ 'కామ్రేడ్' ప్రారంభం
డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడుగా కృష్ణ కన్నెగంటి ('అసాధ్యుడు' ఫేమ్) దర్శకత్వంలో 'కామ్రేడ్' అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. దీనికి 'అందరికి స్నేహితుడు' అనే ట్యాగ్ లైన్ ఉంది. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారంనాడు రాజశేఖర్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించి ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణా స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. రాజశేఖర్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి మంత్రి గీతారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. బి.గోపాల్, ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి సోదరులు, కోదండరామిరెడ్డి, వి.సముద్ర తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
రాజశేఖర్ మాట్లాడుతూ, కామ్రేడ్ అంటే ఒక మంచి మిత్రుడు అనే అర్ధం ఉందనీ, ఆ లైన్స్ లో ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారనీ చెప్పారు. కథ దొరక్కే కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు మంచి సబ్జెక్ట్ దొరికిందని అన్నారు. నేటి వర్తమాన పరిస్ధితిలను ప్రతిబింబిస్తూ చక్కటి సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని చెప్పారు. తన కెరీర్ లో ఇదొక మంచి చిత్రమవుతుందని పేర్కొన్నారు. నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ, ఇటీవల తాను 'ద్రోణ' చిత్రాన్ని నిర్మించాననీ, తాను నిర్మించిన మరో చిత్రం 'కళవర్ కింగ్' విడుదలకు సిద్ధంగా ఉందనీ చెప్పారు. రాజశేఖర్ తో ప్రస్తుతం చేస్తున్న ఈ చిత్రం శివరాత్రి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ, సింగిల్ షెడ్యూల్ లో పూర్తవుతుందనీ తెలిపారు. ఈ చిత్రానికి మంచి కథ కుదిరినట్టు దర్శకుడు కృష్ణ (అనిల్ కృష్ణ) తెలిపారు. ఇంత మంచి అవకాశమిచ్చిన రాజశేఖర్, డి.ఎస్.రావుకు తన కృతజ్ఞతలని అన్నారు. ఇది రాజశేఖర్ కు చాలా మంచి సబ్జెక్ట్ అవుతుందని పరుచూరి సోదరులు పేర్కొనగా, ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ మరోసారి అందర్నీ అలరించనున్నారని జీవితా రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులు, యూనిట్ మధ్య కేక్ కట్ చేసి జరుపుకొన్నారు. నిర్మాత డి.ఎస్.రావు 25 వేల రూపాయల చెక్కును యామిని ఫౌండేషన్ కు అందజేశారు.
Be first to comment on this News / Article!
|