'మాయాబజార్'లో మరోపాట
ఏడున్నర దశాబ్దాలకు పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఇది మన సినిమా అని సగర్వంగా చెప్పుకునే చిత్రరాజం 'మాయాబజార్'. విజయా సంస్థ కీర్తిని చరిత్ర పుటల్లో శాశ్వతం చేసిన ఈ చిత్రం తొలిసారి విడుదలై ఇప్పటికి 53 వసంతాలైనా అలనాటి వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. ఆ చిత్రం తాజాగా రంగులు అద్దుకుని సినిమాస్కోప్, డిటిఎస్ హంగులతో మరోసారి గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి 'విజయ'ఢంకా మోగిస్తోంది. గోల్డ్ స్టోన్ సంస్థ ఈ చిత్రాన్ని రంగుల హరివిల్లులా తీర్దిదిద్దగా, సూపర్ గుడ్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. కొత్త చిత్రాలను కూడా తోసిరాజని ఈ చిత్రం తొలివారం మంచి కలెక్షన్లతో తన పొజిషన్ ను స్ట్రాంగ్ చేసుకుంది. అయితే సరిగా కలరైజేషన్ కుదరకపోవడం వల్లన రెండు కీలకమైన పాటలను ఇందులోంచి తొలగించడం ప్రేక్షకులలో కొంత అసంతృప్తిని నింపింది. దీనిని గుర్తెరెగిన గోల్డ్ స్టోన్ సంస్థ తాజాగా 'చూపులు కలిసిన శుభవేళా' అనే పాటను ఈ చిత్రంలో జోడించి ప్రదర్శించబోతోంది. చిత్ర విజయోత్సవాన్ని పురస్కరించుకుని గోల్డ్ స్టోన్ సంస్థ సిఇవో జగన్మోహన్ ఈ విషయాన్ని తెలియజేశారు.
మొదట్లో కలరైజేషన్ సరిగ్గా కుదరకపోవడంతో 'చూపులు కలిసిన శుభవేళ' పాటను తొలగించాల్సి వచ్చిందని జగన్మోహన్ వివరణ ఇచ్చారు. ప్రేక్షకుల కోరక మేరకు ఇప్పుడు ఆ పాటను జత చేయనున్నామనీ, ఆ సాంగ్ ను పూర్తి క్వాలిటీతో ప్రేక్షకులు థియేటర్లలో చూడవచ్చనీ చెప్పారు. అలనాటి తరం ప్రేక్షకులతో పాటు నేటి యువత కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు తమకెంతో ఆనందం కలిగిస్తోందనీ, ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారనీ సూపర్ గుడ్ ప్రతినిధి వాకాడ అప్పారావు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|