శంకర్ డైరెక్షన్ లో సిద్దార్ధ?
శంకర్ నుంచి సినిమా వస్తోందంటో ఆ సినిమా కోసం ఏళ్ల తరబడి నిరీక్షించే ప్రేక్షకులు ఉన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ప్రతిష్ఠాత్మకంగా ఆయన తెరకెక్కిస్తున్న 'రోబో' (యంత్రం) చిత్రం ప్రస్తుతం 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే పట్టుదలతో శంకర్ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మరో కొత్త చిత్రాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి 'మెగా మూవీ' కాకుండా ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన సన్నిహత వర్గాల భోగట్టా. ఆ ప్రకారం శంకర్ దర్శకత్వం వహించే తదుపరి చిత్రంలో సిద్దార్ధను కథానాయకుడిగా అనుకుంటున్నారట.
శంకర్ 2005లో రజనీకాంత్ తో 'శివాజీ' వంటి హెవీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేసి 2007లో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారనీ, ఆ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే 'రోబో' ప్రాజెక్ట్ చేపట్టారనీ, ఈసారి మాత్రం కొద్దిపాటి మార్పు కోసం మళ్లీ యూత్ కోసం ఓ చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నారనీ చెన్నై వర్గాల కథనం. శంకర్ గతంలో 'జీన్స్', 'బాయ్స్' వంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లను ప్రేక్షకులకు అందించారు. 'బాయ్' చిత్రంతోనే సిద్దార్ధను హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం తర్వాత సిద్దార్ధ తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని బిజీ కావడం, హిందీలోనూ 'లగాన్'తో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు 'స్టైకర్'తో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడం శంకర్ ను సంతోషంలో ముంచెత్తిందట. మళ్లీ సిద్దార్ధతో ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రాన్ని ప్లాన్ చేస్తే మూడు భాషల్లోనూ మంచి క్రేజ్ వస్తుందనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారట. ప్రస్తుతం సిద్దార్ధ తెలుగులో సోషియే ఫాంటసీ 'యోధ', గ్రామీణ నేపథ్యంలో సాగే 'బావ' చిత్రాల్లో నటిస్తున్నారు. పనిలో పనిగా శంకర్ నుంచి పిలుపు వస్తే సిద్దార్ధ పంట పండినట్టే. శంకర్ మాత్రం 'రోబో' రిలీజ్ తర్వాతే ఈ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|