సెన్సారైన 'హైస్కూలు'
పదమూడేళ్ల కుర్రాడు ఓ ముఫ్పై ఏళ్ల అమ్మాయిని ప్రేమించడమనే ఇతివృత్తంతో దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ 'హైస్కూలు'. ఐశ్వర్య ఫిలిమ్స్ పతాకంపై మల్లన్న నిర్మించిన ఈ చిత్రంలో కిరణ్ రాథోడ్, కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇటీవల సెన్సార్ సభ్యులు భారీ కట్స్ చెప్పడంతో రివైజింగ్ కమిటీకి, ఆ తర్వాత ట్రిబ్యునల్ కు వెళ్లి ఎట్టకేలకు పరిమితమైన కట్స్ తో సెన్సార్ పూర్తి చేసుకుంది '1940 లో ఒక గ్రామం' చిత్రంతో జాతీయ అవార్డు పొందిన నరసింహ నందికి ఇది రెండో సినిమా కావడం విశేషం.
ఐశ్వర్య ఫిల్మ్స్ సంస్థ కార్యాలయంలో నరసింహ నంది మాట్లాడుతూ, 'హైస్కూలు' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని చెప్పారు. ఇటీవల తమ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు భారీగా కట్స్ చెప్పడంతో రివైజింగ్ కమిటీకి వెళ్లామనీ, అక్కడ కూడా ఇవే కట్స్ ఇవ్వడంతో ట్రిబ్యునల్ కు వెళ్లి గ్రీన్ సిగ్నల్ పొందామనీ తెలిపారు. రెండు డైలాగ్ లు, ఒక విజువల్ కట్ తో సినిమా ప్రదర్శననకు ట్రిబ్యునల్ అనుమతించిందన్నారు. ఈ చిత్రాన్ని ఎలాంటి అశ్లీలత లేకుండా మంచి సందేశంతో తీశామన్నారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ నే రొమాంటిక్ పంథాలో కామెడీ, సెంటిమెంట్ మేళవించి ఈ చిత్రాన్ని తీశామనీ, ముఖ్యంగా నేటియువతతో పాటు ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. ఇవాల్టి యువతరం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదన్నదే ఇందులో చూపించామని వివరించారు. ఇదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, జెన్నీ, తిలక్, రజిత, గౌతంరాజు, సుదర్శన్ తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం నరసింహ నంది అందించిన ఈ చిత్రానికి కల్యాణ్ సినిమాటోగ్రఫీ, సాకేత్ సాయింరాం సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|