రానా పెళ్లి 2012లో...
ఇది తారల పెళ్లిళ్ల సీజన్. ఇటీవలే రంభ నిశ్చితార్ధం జరిగింది. తిరుపతిలో త్వరలో పెళ్లి జరగనుంది. యంగ్ స్టార్ ఎన్టీఆర్ వివాహం నార్నే కుటుంబానికి చెందిన లక్ష్మీప్రణితో మేలో జరగనుంది. యువహీరో గోపీచంద్, అల్లు అర్జున్, నటి ఛార్మి సైతం పెళ్లికి క్యూలో ఉన్నారు. తాజాగా మరో యువహీరో దగ్గుబాటి రానా సైతం ఓ ఇంటర్వ్యూలో రెండేళ్ల తర్వాత తన పెళ్లి ఉంటుందని తేల్చి చెప్పారు.
దగ్గుబాటి రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడైన రానా 'ది బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని ఆమధ్య నిర్మించారు. తాజాగా ఆయన 'లీడర్' చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇవాల్టి యువహీరోలతో చూసినప్పుడు రానా మంచి ఒడ్డూపొడుగుతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లీడర్' చిత్రం ఈనెల 11న వస్తుండటంతో రానా స్క్రీన్ పై ఎలా ఉండబోతున్నారనే ఉత్సుకత ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ మ్యాగజైన్ రానాను ఇంటర్వ్యూ చేస్తూ...పెళ్లెప్పుడు చేసుకుంటారని ప్రశ్నించినప్పుడు ఆయన తడుముకోకుండా రెండేళ్ల తర్వాత అంటే 2012లో ఉంటుంది అని సమాధానమిచ్చారు. సహజంగా నటీనటులు పెళ్లెప్పుడని ప్రశ్నించినప్పుడు నుదురు చిట్లించి...కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాం...పెళ్లి చేసుకుంటే మీకు చెప్పకుండానా? అంటూ సమాధానం దాటవేస్తుంటారు. రానా మాత్రం ఇందుకు భిన్నంగా 2012 డెడ్ లైన్ అని సూటిగా చెప్పడం గమనార్హం. మరి రానా మనసు దోచుకునే ఆ లక్కీ గాళ్ ఎవరో?!
Be first to comment on this News / Article!
|