ప్రముఖ నటి భర్త మాయం
దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కనక తన భర్త జాడ తెలియక ఆవేదన చెందుతోంది. దీనికి తోడు ఇటీవల ఆమెకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదరింపులు కూడా వస్తుండటంతో ఆమె ఈ విషయాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది. కనక మరెవరో కాదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచిపేరు సంపాదించుకున్న సీనియర్ నటి దేవిక కుమార్తె. తమిళంలో 30కి పైగా చిత్రాల్లోనూ, మలయాళంలో పదికి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ ఒకటి అరా చిత్రాల్లో నటించింది. తమిళ 'కరగాట్ట కారన్', మలయాళ 'గాడ్ ఫాదర్' చిత్రాలు ఆమెకు నటిగా మంచిపేరు తెచ్చాయి. కొద్దికాలం క్రితం ముత్తుకుమార్ అనే వ్యక్తిని సీక్రెట్ గా వివాహం చేసుకుని అప్పట్నించీ నటనకు దూరంగా ఉంటోంది. కాగా...తన భర్త జాడతెలియడం లేదంటూ ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాపోయింది.
కాలిఫోర్నియాకు చెందిన ఇంజనీర్ ముత్తుకుమార్ తో తన వివాహం 2007లో జరిగిందనీ, అయితే పెళ్లయిన 15 రోజుల్లోనే అతని జాడ తెలియకుండా పోయిందనీ ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంతవరకూ అతను ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో కూడా తెలియరాలేదని ఆమె చెప్పారు. దీనికితోడు ఇటీవల కొందరు తనను చంపుతామంటూ బెదరిస్తున్నారని కూడా వెల్లడించింది. ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి ఎం.కరుణానిథి దృష్టికి తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది.
Be first to comment on this News / Article!
|