'అలలు' ఆడియో రిలీజ్
బుల్లితెర యాంకర్ సత్యసురేష్ ను కథానాయకుడుగా పరిచయం చేస్తూ సన్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సునీల్ బండి దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం 'అలలు'. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియో సీడిని రియల్ స్టార్ శ్రీహరి ఆవిష్కరించి తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఆడియో క్యాసెట్లను తమ్మారెడ్డి ఆవిష్కరించి శ్రీహరికి అందించారు. ఆర్.పి.పట్నాయక్, సునీల్ బండి, సుబ్బరాజు, రఘ కుంచె, రమేషన్ నాయుడు, అంజి, అడ్డాలరాజు, సురేష్ సత్య, విజయ్, రూపాకౌర్, హాసిని, సుకుమార్, సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజైంది.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, జెమినీలో యాంకరింగ్ చేసే సత్యసురేష్ ను సినిమాల్లో నటించమని తాను ప్రోత్సహించేవాడిననీ, అతనిలో చక్కటి ప్రతిభ ఉందనీ చెప్పారు. అతను హీరోగా చేస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నానని అన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, సత్యసురేష్ మంచి నటుడనీ, తన సినిమాల్లో కూడా అతనికి అవకాశాలు ఇచ్చాననీ, ఇకముందుకు ఇస్తాననీ అన్నారు. హీరోగా అతని తొలి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, సునిల్, త్రివిక్రమ్, తానూ, సత్యసురేష్ రూమ్ మేట్స్ గా ఉండేవాళ్లమనీ, సురేష్ ను హీరోగా చూడాలనే తన కోరిక ఇప్పుడు తీరనుందని అన్నారు. అలాగే సాయికార్తీక్ మనసుకు హత్తుకునే మంచి సంగీతాన్ని అందించారని అన్నారు. సురేష్ తనకు సోదరుడులాంటి వాడనీ, అతన్ని హీరోగా పరిచయం చేస్తున్న సునిల్ బండికి తన కృతజ్ఞతలనీ రఘుకుంచె పేర్కొన్నారు. హీరోగా కావాలని తనకు, దర్శకుడు కావాలని సునీల్ బండికి, మంచి బ్రేక్ సాధించాలని సాయికార్తీక్ కు ఉండేదనీ, అది ఈ చిత్రంతో తీరబోతోందని సత్యసురేష్ సంతోషం వ్యక్తం చేశారు. భార్యభర్తల మధ్య ఉండే కలహాలు ప్రధానాంశంగా రూపొందిన చిత్రమిదని సునీల్ బండి తెలిపారు.
Be first to comment on this News / Article!
|