'ఒక్కక్షణం' ఆలోచిస్తే...
రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో సెవన్ హిల్స్ టెలీ నెట్ వర్క్ బ్యానర్ పై స్వాతి బాలినేని 'ఒక్కక్షణం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొడాలి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. నేటి సమాజంలో అమాయకులైన యువతులు, బాలికలపై జరుగుతున్న హత్యల నేపథ్యంలో సాగే ఇతివృత్తమిది. మొన్న శ్రీలక్ష్మి (విజయవాడ), నిన్న స్వప్నిక (వరంగల్), ఇవాళ వైష్ణవి (విజయవాడ) దారుణ హత్యకు గురైన ఉదంతాలు ఈ చిత్రానికి ప్రేరణగా చెప్పుకోవచ్చు. అరుణ అనే అమ్మాయి హత్య చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ఆ హత్య చేసినది కిషోర్ అనీ, ఆ వ్యక్తిని నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజలు, విద్యార్థులు, మీడియా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారు. ఆ తర్వాత ఏమి జరిగిందన్నదే తమ చిత్ర కథ అని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని పాత్రికేయులకు ప్రదర్శించారు.
అనంతరం స్వాతి బాలినేని మాట్లాడుతూ, ఎం.ఎస్.రెడ్డి బాలలతో తీసిన 'రామాయణం'లో తాను రావణుడి పాత్ర పోషించాననీ, మళ్లీ ఒక మంచి చిత్రం ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉందనీ తెలిపారు. దర్శకుడు కొడిలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నేడు సమాజంలో అనేకమంది వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ఇందువల్ల నిర్దోషులు దోషులు అవుతున్నారనీ అన్నారు. ఆలాకాకుండా 'ఒక్కక్షణం' ఆలోచించి అడుగు వేస్తే మంచి ఫలితాలు వస్యాయని చెప్పే చిత్రమిదని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, గిరిబాబు, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, ఎల్బీ శ్రీరామ్, జీవా, వైజాగ్ ప్రసాద్, నారాయణరావు, రక్ష తదితరులు నటించారు. శౌరి మాటలు, ఎ.కె.ఎస్. సినిమాటోగ్రఫీ, రమేష్ ఎడిటింగ్, అర్జున్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|