'అదుర్స్' ప్రదర్శనలకు బ్రేక్!
ఎన్టీఆర్ కథానాయకుడుగా కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మించిన 'అదుర్స్' చిత్రం సంక్రాంతి హిట్ గా డిక్లేర్ అయిన తరుణంలో మళ్లీ ఆ చిత్రం తెలంగాణవాదుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని పలు చోట్ల 'అదుర్స్' ప్రదర్శనను ఆందోళనకారులు సోమవారంనాడు అడ్డుకుని చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. థియేటర్ల అద్దాలు పగులగొట్టడం, పోస్టర్లు చించివేసి నిప్పుపెట్టడం వంటి ఆందోళనలకు దిగారు. దీంతో ఆరు జిల్లాల్లో 'అదుర్స్' చిత్ర ప్రదర్శనకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ వివాదంతో సంబంధం లేకపోయినప్పటికీ మంచు మనోజ్ నటించగా గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'బిందాస్' చిత్ర ప్రదర్శనకు కూడా పలుచోట్ల నిలిచిపోయింది.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కూడా అయిన కొడాలి నాని ఆదివారంనాడు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదుల ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి ప్రజల మద్దుతు లేదని, అందువల్లనే తెలంగాణలో 'అదుర్స్' చిత్ర ప్రదర్శనను టిఆర్ఎస్ అడ్డుకోలేకపోయిందనీ నాని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్నవారు రాజకీయ నిరుద్యోగులంటూ విసుర్లు విసిరారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యల పట్ల టిఆర్ఎస్ నుంచే కాకుండా తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ ఓర్పును బలహీనతగా అర్ధం చేసుకోవద్దనీ, నాని క్షమాపణ చెప్పాలనీ టిఆర్ఎస్ నేత హరీష్ రావ్ డిమాండ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ సైతం నాని వ్యాఖ్యలను ఖండించాలని ఆయన పట్టుబడ్డారు. టిఆర్ఎస్ గత నెలలో తెలంగాణలో 'అదుర్స్' చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించడం కలకలం సృష్టించింది. ఈ చిత్ర నిర్మాతలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకులంటూ కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత 'అదుర్స్' బాయ్ కాట్ కు పిలుపునిచ్చారు. ఆల్ పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) చొరవ తీసుకోవడం, ఆర్టిస్టులకు ఏ ప్రాంతానికి చెందిన వారు కారంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రకటించడం, తాను తెలంగాణలోనే పుట్టాననీ, తెలంగాణలోనే తుదిశ్వాస విడుస్తాననీ విస్పష్టంగా ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. హైకోర్టు జోక్యంతో 'అదుర్స్' ఎలాంటి ప్రతిఘటన లేకుండానే థియేటర్ల ముందుకు వచ్చింది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|