నానీ...ఇదేం పని?!
'అదుర్స్' చిత్ర నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చేలా ఉన్నాయనీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి పరిశ్రమను చిక్కుల్లో పెట్టాలనుకుంటే ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉంటుందని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర వాదనకు ప్రజామోదం లేదనడానికి 'అదుర్స్' చిత్రాన్ని తెలంగాణలో అడ్డుకోలేకపోవడమే నిదర్శనమంటూ కొడాలి నాని ఆదివారంనాడు చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ కలకలం సృష్టించింది. సోమవారంనాడు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ తరఫున తమ్మారెడ్డి భరద్వాజ, కె.సి.శేఖర్ బాబు, డి.సురేష్ బాబు, మురళీమోహన్ తదితరులు సమావేశమై నాని వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు.
సినిమా వారికి ప్రాంతాలతో కానీ, రాజకీయాలతో గానీ ఎలాంటి సంబంధం లేదని తమ్మారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎవరైనా అందుకు భిన్నంగా మాట్లాడితే అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం కిందకే వస్తుందనీ, అందుకు సంబంధించిన పరిణామాలను కూడా వారే ఎదుర్కోవలసి ఉంటుందనీ ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై పెద్దలే (పార్టీ అధినేతలు) చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం లేదనే తమ అభిప్రాయానికి పరిశ్రమ కట్టుబడి ఉందని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో ఎవరూ చిక్కులు కొనతేవద్దని అన్యాపదేశంగా నానికి హితోపదేశం పలికారు. డి.సురేష్ బాబు మాట్లాడుతూ, గత మూడు వారాలుగా ఎంతో చక్కగా సినిమాలు విడుదలవుతూ పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోందనీ, ఆ వాతావరణానికి కలుషితం చేయడం ఎవరికీ మంచిది కాదని అన్నారు. అన్ని ప్రాంతాల వారు చూడాలనే తపనతోనే ఏ నిర్మాత అయినా సినిమా తీస్తారనీ, ఎవరైనా దీనితో విభేదించినట్లయితే వారిపై చర్యలు తీసుకునే అవకాశాలను సీరియస్ గానే పరిశీలిస్తామన్నారు. ఇది సహాయనిరాకరణ రూపంలో ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
Be first to comment on this News / Article!
|