ఎన్టీఆర్ నిశ్చితార్ధం ఏప్రిల్ 1న
ఈ ఏడాది 'అదుర్స్'తో హిట్ కొట్టి తన వివాహ వార్తతో ఎన్టీఆర్ తన అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీప్రణతితో ఎన్టీఆర్ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు ఇటీవల నిశ్చయించారు. తాజాగా చైత్ర బహుళ తిథియ శుభ ముహూర్తంగా ఏప్రిల్ 1వ తేదీన నిశ్చితార్ధానికి పండితులు నిర్ణయించారు. వివాహ వేదిక ఎక్కడనేది ఇంకా ఇతమిద్ధంగా ఖరారు కానప్పటికీ హైద్రాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లోని నోవాటెల్ లో ఈ వేడుక జరిపే అవకాశాలున్నాయి. పెద్దగా హంగామా లేకుండా కేవలం ఎంపిక చేసిన అతిథులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. నిశ్చితార్ధాన్ని ఫ్యామిలీ ఫంక్షన్ గానే జరిపి వివాహానికి మాత్రం టాలీవుడ్ చెందిన వారిని, తన మిత్రులను, సన్నిహితులు ఆహ్వానించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. నిశ్చితార్ధానికి సంబంధించి ఇప్పటికే సందడి మొదలు కాగా, మేలో వివాహం ఉంటుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ కెరీర్ పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తాజాగా జైపూర్ లో జరుగుతున్న 'శక్తి' షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్కడ 15 రోజుల పాటు కీలక షెడ్యూల్ జరుపుకొంటుంది. అనంతరం ఎన్టీఆర్ హైద్రాబాద్ కు తిరిగొచ్చి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం' షూటింగ్ లో పాల్గొంటారు. ఈ రెండు చిత్రాలు ఇదే ఏడాదే విడుదలవుతాయి.
Be first to comment on this News / Article!
|