యుక్తాముఖి 'ప్రతీకార జ్వాల'
ఇందిరాగాంధీ హత్యానంతరం చోటుచేసుకున్న అల్లర్లలో హైద్రాబాద్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా 'ప్రతీకార జ్వాల' చిత్రం రూపొందింది. యుక్తాముఖి ప్రధాన పాత్రలో, వినయ్ కథానాయకుడు నటించారు. ఈ చిత్రానికి మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ సమర్పకుడుగా వ్యవహరించారు. హర్షత్ దర్శకత్వంలో ఆర్.కె.ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది.
చిత్ర విశేషాలను సంస్థ కార్యాలయంలో ఎ.చంద్రశేఖర్ తెలియజేస్తూ, 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ వంటి అనేక ప్రాంతాలతో పాటు హైద్రాబాద్ లో కూడా అల్లర్లు జరిగాయనీ, ఆ నేపథ్యంలో ఓ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న ఇతివృత్తంతో ఈ చిత్రం తెరక్కిందని చెప్పారు. మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించినట్టు చెప్పారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, వాస్తవ కథతో ఈ చిత్రం తెరకెక్కిందన్నారు. అల్లర్లలో కుటుంబాన్ని కోల్పోయిన ఓ అమ్మాయిని దుండగులు ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తారనీ, ఎట్టకేలకు అక్కడ్నించి బయటపడిన ఆ అమ్మాయి వారిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకుందనేది ఆసక్తికరంగా ఉంటుందనీ అన్నారు. యుక్తాముఖి గ్లామర్ తో పాటు అభినయం హైలైట్ గా ఉంటుందని చెప్పారు. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులోని ఐదు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సహ నిర్మాత బి.నాగేశ్వర్, గీత రచయిత డాక్టర్ కావూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రానికి ఉదయ్ రాజు మాటలు, మేనగ శ్రీను ఎడిటింగ్, నిఖిల్-వినయ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|