నాగ్ 'కేడి'కి యు/ఎ
నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'కేడి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం కామాక్షి మూవీస్ రజతోత్సవ కానుకగా ఈనెల 12న విడుదలవుతోంది.
నాగార్జున చిత్ర విశేషాలను తెలియజేస్తూ, ఇందులో మనుషుల్ని మాయచేసే తరహాలో తన పాత్ర ఉంటుందనీ, గాంబ్లింగ్, కార్ల దొంగతనాల నేపథ్యంలో కథ ఉంటుందనీ తెలిపారు. ఎంటర్ టైనింగ్ గా ప్రారంభమయ్యే ఈ చిత్రం క్రమంగా సీరియస్ తరహాలోని మళ్లుతుందనీ, కథ-కథనం చాలా కొత్త తరహాలో ఉండేలా ఈ చిత్రాన్ని స్టైలిష్ గా కిరణ్ తెరకెక్కించారనీ తెలిపారు. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే రొమాన్స్ కూడా ఉంటుందన్నారు. సందీప్ చౌతా సంగీతం ఈ చిత్రానికి ఓ ప్రధాన హైలైట్ అవుతుందనీ, రజతోత్సవ సంవత్సరంలో శివప్రసాద్ రెడ్డి చక్కటి నిర్మాణవిలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారనీ చెప్పారు. 'కింగ్' తర్వాత నాగార్జునతో తమ బ్యానర్ లో వస్తున్న మరో సూపర్ హిట్ చిత్రమిదని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పాతికేళ్లుగా నాగార్జునతో తనకు స్నేహం ఉందనీ, ఇప్పుడు తమ సంస్థ కూడా రజతోత్సవంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందనీ సంతోషం వ్యక్తం చేశారు. ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టయిందనీ, సినిమా అంతకంటే మంచి హిట్ అవుతుందనే గట్టి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా మమతా మోహన్ దాస్, మరో కీలక పాత్రలో అమెరికా అమ్మాయి లిండా నటించారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ అంకుర్, 'బండిట్ క్వీన్' ఫేమ్ నిర్మల్ పాండే, 'లగాన్' ఫేమ్ అఖిలేంద్ర మిశ్రా, 'డాన్' విలన్ కెల్లీ డార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కిరణ్ అందించిన ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, చిన్నచరణ్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, శ్రవణ్ ఎడిటింగ్ అందించారు. అక్కినేని వెంకటరత్నం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|