ముద్దంటే చేదా...
సినిమా హిట్ లో సగం ఆడియోకు దక్కుతుంటుంది. సందీప్ చౌతా సంగీతం అందించిన ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇందులో బిట్స్ సాంగ్స్ తో సహా తొమ్మిది పాటలున్నాయి. అన్నీ నాకు బాగా నచ్చినవే. ముఖ్యంగా 'కేడి' టైటిల్ సాంగ్. అలాగే..నాన్నగారు నటించిన 'అదృష్టవంతులు' చిత్రంలోని 'ము మ్ము మ్ముద్దంటే చేదా' పాటను ఇందులో రీమిక్స్ చేశాం. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. నాకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నాన్నాగారి పాటను సారథి స్టూడియోస్ లో చిత్రీకరించినప్పుడు దగ్గరుండి మరీ చూశాను. ఆ అనుభూతి ఇప్పటికీ మరిచిపోలేను.
గ్రీసులో సన్మానం...
కథానుసారంగా హీరో ప్రయాణం గోవాకు సాగుతుంది. అక్కడ 35 నుంచి 40 రోజుల పాటు షూటింగ్ చేశాం. ఇక గ్రీసులో షూటింగ్ చేయడం మరపురాని అనుభూతిని మిగిల్చింది. అక్కడ షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే. అక్కడి జనాభా ఐదు వేలు. విదేశీ పర్యాటకులు మాత్రం రోజుకు రెండు లక్షల మంది వస్తుంటారు. వాతావరణం విపరీతమైన మంచుతో ఉంటుంది. అక్కడి వాళ్లు నన్ను గ్రీకువీరుడుగా సన్మానించడం ఓ మధురానుభూతి.
పాతికేళ్ల బంధం...
నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి 25 ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నారు. నేనూ 25 ఏళ్లుగా నటిస్తున్నాను. 'కింగ్' తర్వాత శివప్రసాద్ రెడ్డితోనే ఈ సినిమా చేయడానికి మంచి సబ్జెక్ట్ కుదిరింది. శివప్రసాద్ రెడ్డి నా అభిమాని అనడం కంటే నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. 'కేడి' కామాక్షి మూవీస్ రజతోత్సవ కానుక కావడం చాలా సంతోషంగా ఉంది.