సైలెంట్ ఆడియోలు...
ఆడియో ఆర్భాటంగా రిలీజై దుమ్ము దులుపుతుంటే సినిమా విడుదలకు సిద్ధమవుతోందని అర్ధం. గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు కూడా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ద్వారా పబ్లిసిటీ షురూ చేస్తుంటాయి. ఆడియో హిట్టయితే సగం సినిమా హిట్టయినట్టేనని ఫిల్మ్ మేకర్స్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. కొండొకచే సినిమా రిలీజ్ కు ముందే ఆడియో అమ్మకాలు జోరుగు సాగించి ప్లాటినం డిస్క్ వేడుకలు కూడా జరుపుతుంటారు. సినిమా రిలీజ్ తర్వాత డబుల్, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ల ప్రధానం జరిపి సినిమాకి మరింత ప్రచారం తెచ్చిపెడుతుంటారు. అయితే కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆడియో మూగబోయింది. నిరాడంబరంగానే ఆడియో ఫంక్షన్లు లాగించేస్తున్నారు.
వెంకటేష్ కథానాయకుడుగా సంక్రాంతికి విడుదలై విజయవంతమైన 'నమో వెంకటేష' చిత్రం ఆడియో పెద్ద హిట్. అయితే ఆడియో రిలీజ్ మాత్రం పాట షూటింగ్ కు బ్యాంకాకు వెళ్లి అక్కడే కానిచ్చేశారు. రాష్ట్రంలోని అప్పటి పరిస్థితులు కూడా ఆడియో వేడుక ఆర్భాటంగా జరపకపోవడానికి ఓ కారణం కావచ్చు. ఆ తర్వాత పాటలు నేరుగా మార్కెట్ లోకి వచ్చేశాయి. సినిమా హిట్టయిన తర్వాత రన్నింగ్ థియేటర్ లో ట్రిపుల్ ప్లాటినం జరిపారు. ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతున్న నాగార్జున 'కేడి' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆడియో రిలీజ్ ఈమధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిపి అందుకు సంబంధించిన వార్తను, రెండు మూడు ఫోటోలు మీడియాకు పంపేసి అయిందనిపించారు. నాగార్జున ఆడియోకి ఆర్భాటం చేయనప్పుడు నాగచైతన్య విషయంలో ఎందుకనుకున్నారో ఏమో కానీ నాగచైతన్య కథానాయకుడుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఏమాయ చేసావె' ఆడియో కూడా హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతల సమక్షంలో ఈమధ్యనే నిరాడంబరంగా రిలీజ్ చేశారు. పేపర్ అడ్వర్ టైజ్ మెంట్ చూసే ఆడియో రిలీజ్ అయిన విషయం తెలుసుకోవాల్సిన పరిస్థితి సినీగోయెర్స్ కు తప్పలేదు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. విశాల్ కథానాయకుడుగా ఆయన సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మించిన 'కిలాడి' ఆడియో సైతం ఇలాగే సైలెంట్ గా రిలీజ్ చేసి మార్కెట్ లోకి పంపారు. ప్రస్తుతంలో రాష్ట్రంలో ఉద్యమాల జోరు సాగుతుండటం, కొత్త చిత్రాలు థియేటర్లకు రావడానికి బెదురుతున్న తరుణంలో సైలెంట్ గా ఆడియోలు రిలీజ్ చేయడమే సేఫ్ సైడ్ అని పరిశ్రమ ప్రముఖులు భావిస్తూ ఉండొచ్చు. సైలెంట్ ఆడియోల వ్యవహారం తాత్కాలికమేనా, కొత్త ఒరవడి మొదలైందా అనేది మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|