పెళ్లికి తొందర్లేదన్న ఛార్మి
తారలకు పాపులారిటీ పెరిగే కొద్దీ గాసిప్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి ఇవి రూమర్స్ కాదనీ నిజమనీ తేలుతుంటాయి. ఎక్కువసార్లు మాత్రం అవి రూమర్స్ గానే మిగిలి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి పేరు అప్పట్లో దేవీశ్రీప్రసాద్ తో ముడిపడి పలు గాసిప్స్ వచ్చాయి. అవి గాసిప్స్ గానే మిగిలాయి. కొద్దిరోజులుగా మళ్లీ చార్మి పెళ్లి గురించిన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పంజాబీ యువకుడితోనే ఛార్మి పెళ్లి ఈ ఏడాది జరగబోతోందనీ, ఇద్దరికీ ఏడాదిగా పరిచయం ఉందనీ వార్తలు వచ్చాయి. కొందరైతే ఏకంగా నిశ్చితార్ధం కూడా అయిపోయిందనీ, పెళ్లి కార్డులు అచ్చు అవుతున్నాయనీ కథనాలు అల్లేశారు. ఈ వార్తలను ఛార్మి అంతే వేగంగా ఖండించింది.
'ప్రసార మాధ్యమాల్లో నా పెళ్లి వార్తలు చూసి ఆశ్చర్యపోయాను. ఇవన్నీ అవాస్తవాలు. ఇలాంటి వార్తలు రాసే వాళ్లు తమ సమయం వృథా అవుతోందని గ్రహించడం మంచింది. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ మీదే ఉంది. ఒకవేళ పెళ్లంటూ చేసుకుంటే ముందుగా మీడియాకే చెబుతాను. సరేనా..' అంటూ రుసరుసలాడింది. అంతలోనే తమాయించుకుంటూ, ప్రస్తుతం కెరీర్ మంచి స్వింగ్ లో ఉందనీ, తన తాజా చిత్రం 'సై ఆట' త్వరలోనే విడుదల కానుందనీ చెప్పింది. ఇందులో సరికొత్త ఛార్మిని చూస్తారనీ, 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' చిత్రాలకు ఒక మెట్టు పైనే ఈ సినిమా ఉంటుందనీ ధీమాగా చెప్పుకొచ్చింది.
Be first to comment on this News / Article!
|