సీడ్నీలో రామ్ చరణ్ 'ఆరంజ్'
'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత రామ్ చరణ్ ఏ చిత్రానికి పనిచేస్తారనే సస్పెన్స్ కు తెరదించుతూ ఆయన మూడో చిత్రం భాస్కర్ దర్శకత్వంలో ఇటీవలే మొదలైంది. 'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి హిట్ చిత్రాల తర్వాత భాస్కర్ కు కూడా ఇది మూడో సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై కె.నాగేంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ముంబైలో తొలి షెడ్యూల్ జరుపుకొన్న ఈ చిత్రం ఆస్టేలియాలో ఓ భారీ షెడ్యూల్ కు సన్నద్ధమవుతోంది.
రామ్ చరణ్ ఈ చిత్రంలో కొత్త గెటప్ లో కనిపించబోతున్నారనీ, సున్నితమైన ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని భాస్కర్ తెరకెక్కించనున్నారనీ తెలుస్తోంది. దీనికి 'ఆరంజ్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం టైటిల్ నిశ్చయించాల్సి ఉంది. తొలుత అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నప్పటికీ చివరకు ఆస్ట్రేలియా వైపే మొగ్గుచూపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ లో మార్చి మొదటివారం నుంచి తాజా షెడ్యూల్ మొదలవుతుంది. రామ్ చరణ్ ఈ నెలాఖరుకు సిడ్నీ బయలుదేరి వెళ్తారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా, మరో నాయికగా షాజాన్ పదంసీ నటిస్తున్నారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తోట ప్రసాద్ సంభాషణలు, కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ పాటలు, ఆనంద్ సాయి ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, హారిస్ జైరాజ్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|