కార్తీ ఆల్ టైమ్ ఫేవరెట్ చిరు
తమిళ స్టార్ హీరో సూర్యకు తమ్ముడుగానే తెలిసిన కార్తి ఇప్పుడు 'యుగానికి ఒక్కడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. తన అన్నను ఆదిరించినట్టే తనను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరడం ద్వారా కార్తి టాలీవుడ్ లో పాగా వేశారు. గత వారంలోనే విడుదలైన 'యుగానికి ఒక్కడు' భారీ ఓపినింగ్స్ రాబట్టి ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది. తమిళ వెర్షన్ 'ఆయిరత్తిలో ఒరువన్' సోసో గానే అనిపించుకున్నా తెలుగు ప్రేక్షకులు పెద్దపీట వేయడం సూర్యను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇదే అదనుగా రెండేళ్ల క్రితం కార్తి తమిళంలో విడుదలై విజయవంతమైన 'పరుత్తి వీరన్' చిత్రాన్ని కూడా ఇప్పుడు 'పల్నాటి రుద్రుడు' పేరుతో తెలుగులోకి అనువదించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్న కార్తి ఇక్కడి యంగ్ స్టార్స్ లో తనకు నచ్చిన అంశాలు, తెలుగు సినిమాలంటే తనకున్న అభిరుచిని తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
'తెలుగు సినిమాలు నాకు కొత్త కాదు. ఒకరకంగా నా జీవితంలో అవి కూడా ఓ భాగం. లెక్కలేనని తెలుగు సినిమాలు చూశాను. అప్పటికీ ఇప్పటికీ నా అభిమాన హీరో చిరంజీవి గారే. కొత్త జనరేషన్ స్టార్స్ లోనూ పలువురు ఫేవరెట్స్ ఉన్నారు. రవితేజకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన కామెడీ టైమింగ్ సూపర్బ్. ఎన్టీఆర్, అల్లు అర్జున్ డాన్స్ లు చూస్తుంటే కంటికి కునుకురాదు. అద్భుతంగా డాన్స్ లు చేస్తారు. మహేష్ బాబు స్టైల్ చాలా బాగుంటుంది. ఏ పని చేసినా అంకితభావం కనిపిస్తుంది' అంటూ వారిపట్ల తనకున్న ఆరాధనాభావాన్ని కార్తి చాటుకున్నారు. ప్రకృతి ఆరాధకుడైన కార్తి ఏమాత్రం తీరిక దొరికినా వన్యప్రాణుల సంరక్షణా సెంటర్లలో వాటిని తిలకించడం, పర్వాతోరోహణ, మిత్రులకు రోడ్లపై లాంగ్ ట్రిప్ లు చేయడం అంటే ఇష్టపడతారట. ప్రస్తుతం తమిళంలో 'పయ్యా', రవితేజ హీరోగా తెలుగులో విజయవంతమైన 'విక్రమార్కుడు' తమిళ రీమేక్ లో కార్తి నటిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|