'బిందాస్' విజయోత్సాహం
మంచు మనోజ్, షీనా జంటగా వీరుపోట్ల దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన 'బిందాస్' ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుండటం ఆ చిత్రయూనిట్ ను సంబరంలో ముంచెత్తుతుంది. ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియోస్ లో చిత్రం సక్సెస్ మీట్ జరిగింది. మనోజ్, షీలా, అనిల్ సుంకర, వీరుపోట్ల, పరుచూరి సోదరులు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, వెన్నెల కిషోర్, మార్తాండ్ కె.వెంకటేష్, శ్రీధర్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ, రామానాయుడు స్టూడియోస్ లో తన మొదటి చిత్ర 'దొంగ దొంగది' ప్రారంభమైందనీ, 'బిందాస్' సక్సెస్ మీట్ ఇదే చోట జరుగుతుండటం తనకెంతో ఆనందంగా ఉందనీ అన్నారు. ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ వీరుపోట్లకే దక్కుతుందన్నారు. మళ్లీ సినిమా అర్ధ శతదినోత్సవం, శతదినోత్సవం సమయాల్లో తాను మాట్లాడతానని అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వీరుపోట్ల తమ శిష్యుడేననీ, ఈ చిత్రంలోని క్యారెక్టర్లను తీర్దిదిద్దిన తీరు ప్రశంసనీయమనీ అన్నారు. తాను ఈ చిత్రాన్ని పాలకొల్లులో చూసినప్పుడు కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ సినిమా బాగుందంటూ అందరూ చెప్పడం సంతోషం కలిగించిందన్నారు. చిత్రం విజయం పట్ల మోహన్ బాబు ముఖంలో చూడా సంతోషం తాను చూశానన్నారు. సినిమా సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలని వీరుపోట్ల అన్నారు. రచయితగా ఉంటూ తొలిసారి దర్శకత్వం వహించడంతో మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాడనీ, అయితే ఇటు మంచు మనోజ్ కూ , అటు నిర్మాతకూ తన టాలెంట్ పై మంచి నమ్మకం చూపేవారనీ అన్నారు. తొలి సన్నివేశం చేసిన వెంటనే మనోజ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారనీ, అలాగే తనకు గురుతుల్యులైన పరుచూరి సోదరులకు రుణపడి ఉంటాననీ అన్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ, సినిమా ప్రారంభానికి ముందు కథ కూడా వినకుండా మనోజ్ ను అప్పగిస్తున్నానని మోహన్ బాబు తనతో అన్నారనీ, ఆయనను ఏమాత్రం నిరుత్సాహ పరచనని మాట ఇచ్చాననీ, ఇప్పుడు మనోజ్ కు మంచి హిట్ ఇవ్వడం ద్వారా ఆ మాట నిలుపుకొన్నాననీ అన్నారు. మనోజ్ భవిష్యత్తులో సూపర్ స్టార్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిత్ర విజయం పట్ల ఇతర యూనిట్ సభ్యులంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|