రానా సరసన బిపాసా
తొలి సినిమా 'లీడర్' ఇంకా విడుదల కాకమునుపే దగ్గుబాటి రానాకు బాలీవుడ్ లో సైతం బంపర్ ఎంట్రీ లభించింది. రమేష్ సిప్పీ నిర్మాతగా రోహన్ సిప్పీ దర్శకత్వంలో 'దమ్ మారో దమ్' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ పోషిస్తుండగా, మరో హీరోగా రానా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానా సరసన సెక్సీ బ్యూటీ బిపాసా బసు రొమాన్స్ చేయబోతోంది. ప్రతీక్ బబ్బర్, ఆదిత్య పంచోలీ తదితరులు నటిస్తున్నారు. రానా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు.
బిపాసా బసు తన సరసన నటిస్తున్న విషయంపై రానా ఇంకా పెదవి విప్పనప్పటికీ ఈ విషయాన్ని బాలీవుడ్ వర్గాలు మాత్రం ధ్రువీకరిస్తున్నాయి. తొలుత ప్రియాంక చోప్రాను అనుకున్నప్పటికీ ఆ ఆఫర్ ను ఆమె తోసిపుచ్చిందనీ, ఇదే పాత్రకు కంగనా రనౌత్ ను నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఫైనల్ గా బిపాస ఎంటర్ అయిందనీ ఆ వర్గాలు తెలిపాయి. గోవాలోని మాదక ద్రవ్యాల మాఫియాకు సంబంధించిన కథాంశంతో 'దమ్ మారో దమ్' తెరకెక్కుతోంది. రానా బాలీవుడ్ ఎంట్రీపై రామానాయుడు స్టూడియోస్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 'రానాకు మొదట్నించీ బాలీవుడ్ పై కన్నుంది. అక్కడ సినిమాలు ఎక్కువగా స్టార్ట్స్ చుట్టూ కాకుండా కథలను నమ్ముకునే తీస్తుంటారనేది ఆయన నిశ్చితాభిప్రాయం. బాలీవుడ్ సినిమాకి దేశవ్యాప్త గుర్తింపు, అందుకు తగ్గ మార్కెట్ ఉంది. అలాంటి అవకాశం ఇప్పుడు రానాకు రావడంతో ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను అంగీకరించారు' అని వెల్లడించారు. రానా తొలి టాలీవుడ్ చిత్రం 'లీడర్' ఇదేనెల 19న భారీ అంచనాలతో విడుదలవుతోంది.
Be first to comment on this News / Article!
|