'గాయం-2' సెట్స్ లో బర్త్ డే
హీరోగా తన ఇమేజ్ ను మార్చిన చిత్రం 'గాయం' అనీ, ఇప్పుడు దానికి కొనసాగింపుగా చేస్తున్న 'గాయం 2' కూడా ఓ వైవిధ్య భరితమైన చిత్రంగా అందరినీ అలరిస్తుందనీ చిత్ర కథానాయకుడు జగపతిబాబు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతున్న 'గాయం 2' చిత్రం షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. అక్కడే శుక్రవారంనాడు తన యూనిట్ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకొన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ, నటుడిగా కెరీర్ ప్రారంభించి 21 వసంతాలైందనీ, తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో వెరైటీ సినిమాలు చేశాననీ అన్నారు. పెద్దరికం, బలరామకృష్ణులు వంటి కుటుంబ కథలు, శుభలగ్నం, మావిచిగురు వంటి దాంపత్య నేపథ్యంలో సాగే చిత్రాలు, గాయం, అంత:పురం, సిద్ధం వంటి మాస్ ఎంటర్ టైనర్లు చేశాననీ, ఎలాంటి క్యారెక్టర్ చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారనీ అన్నారు. 'గాయం 2' చిత్రం కూడా చక్కటి వైవిధ్యమైన చిత్రమనీ, ప్రేక్షకులు ఆదరిస్తారనే గట్టి నమ్మకం ఉందనీ అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా పనచేసిన తనకు దర్శకుడుగా ఇది తొలి చిత్రమని అన్నారు. నిర్మాత ధర్మకర్త మాట్లాడుతూ, ఇందులో కొత్త జగపతిబాబును చూస్తారనీ, విమలారామన్ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషిస్తోందనీ చెప్పారు. ఈనెల 1 నుంచి బ్యాంకాక్ లో చిత్రీకరణ మొదలైందన్నారు. 20వ తేదీ వరకూ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెప్పారు. లైన్ ప్రొడ్యూసర్ భరత్ సి మాట్లాడుతూ, జగపతిబాబు కెరీర్ లో మైలురాయిగా నిలిచిన గాయం చిత్రానికి ఇది కొనసాగింపనీ, వర్మ శిష్యుడు ప్రవీణ్ సి దర్శకుడిగా పరిచయమవుతున్నారనీ చెప్పారు. జగపతిబాబు ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. జగపతిబాబు బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ 'గాయం 2' టీ షర్ట్ లు ధరించి సందడి చేశారు.
Be first to comment on this News / Article!
|