దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'రోబో' చిత్రం తుదిమెరుగుల దశలో ఉంది. సమ్మర్ రిలీజ్ గా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ ను పవర్ ఫుల్ యానిమేషన్ క్యారెక్టర్ లో చూపిస్తూ ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'సుల్తాన్ ది వారియర్' సైతం ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా 17 భాషల్లో 3000 ప్రింట్లతో విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో రజనీకాంత్ తదుపరి చిత్రం ఏమై ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఇందుకు తగ్గట్టుగానే రజనీతో 'చంద్రముఖి-2' తీసేందుకు దర్శకుడు పి.వాసు పట్టుదలగా ఉన్నారు.
రజనీతో 'చంద్రముఖి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన పి.వాసు దీనికి సీక్వెల్ చేయాలని రజనీని కొద్దికాలంగా ఒప్పించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే రజనీ వేరే ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని పి.వాసు కన్నడంలో 'ఆప్తరక్షక' పేరుతో తీశారు. ఇటీవల కన్నుమూసిన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్దన్ చివరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. రెండ్రోజుల క్రితం ఈ చిత్రాన్ని చెన్నైలో ఎవిఎం స్టూడియోస్ లోని ప్రివ్యూ థియేటర్ లో రజనీకాంత్ కు పి.వాసు చూపించారు. రజనీతో పాటు 'చంద్రముఖి'లో కీలక పాత్ర పోషించిన ప్రభు కూడా ఈ చిత్రాన్ని తిలకించారు. తనకు ఆప్తమిత్రుడైన విష్ణువర్దన్ ను తెరపై చూసిన రజనీ కంటతడి పెట్టారట. సినిమా బాగుందని వాసుకు కితాబు కూడా ఇచ్చారట. అయితే తమిళ వెర్షన్ లో నటించే విషయంపై రజనీ ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రజనీ తదుపరి చిత్రం ఇదే అవుతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.