'బద్రీనాథ్'లో షీనా?
అల్లు అర్జున్ నటిస్తున్న'వరుడు' చిత్రం మార్చి 26న విడుదలకు సిద్ధం అవుతుండగా, క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న 'వేదం' ఈ ఏడాది ద్వితీయార్థం ప్రారంభంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండింటి తర్వాత అల్లు అర్జున్ తమ సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ పతాకంపై 'బద్రీనాథ్' చిత్రానికి కమిట్ అయ్యారు. 'హ్యాపీ' చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఈ బ్యానర్ లో నటిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నారు. తాజాగా 'అదుర్స్' వంటి హిట్ చిత్రాన్ని అందించిన వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. చిన్నకృష్ణ కథారచన చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా షీనాను వినాయక్ ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా భోగట్టా.
షీనా కంటే ముందు అల్లు అర్జున్ తో 'దేశముదురు'లో నటించిన హన్సిక పేరు ప్రచారంలోకి వచ్చింది. భారీ రెమ్యునరేషన్ ను హన్సిక డిమాండ్ చేయడంతో ఆ ప్రపోజల్ డ్రాప్ అయింది. దీంతో తమిళంలో మంచి డిమాండ్ లో ఉండి, తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన తమన్నా హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని తమన్నా కూడా ధ్రువీకరించింది. అయితే ఇప్పుడు తమన్నా ప్లేస్ లో షీనా వచ్చి చేరిందని అంటున్నారు. షీనా ముఖంలో అక్కడక్కడా తమన్నా పోలికలుండటంతో షీనాను వినాయక్ సంప్రదించారనీ, లీడ్ రోల్ ఆఫర్ ఇవ్వడంతో పెద్దమొత్తంలో డేట్స్ ఇవ్వడానికి షీనా ముందుకు వచ్చిందనీ అంటున్నారు. ఇందుకోసం 15 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే చాలని ఆమె చెప్పడంతో షీనా ఎంపిక ఖాయమైందట. షీనా ఇటీవలే మంచు మనోజ్ 'బిందాస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సినిమా సక్సెస్ కావడం, షీనా మరీ చిన్నపిల్లగా ఉందనే మాట వినిపించినప్పుటికీ వెండితెరపై అందాలు పరచడంలో ఏమాత్రం వెనుకంజవేయకపోవడం వినాయక్ ను ఆకట్టుకుందని అంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం రావడం అంటే షీనా కెరీర్ ఊపందుకున్నట్టే. మార్చిలో 'బద్రీనాథ్' సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|