'వేదం' ఎందాక వచ్చింది?
తొలి సినిమా గ్రాండ్ సక్సెస్ అయితే మలి సినిమాకు ఆపసోపాలు తప్పవేమో? తొలి చిత్రం 'గమ్యం' తో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్, పలు అవార్డులు దక్కించుకున్న దర్శకుడు జాగర్లమూడి రాథాకృష్ణ అలియాస్ క్రిష్ సైతం ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. తన రెండో ప్రాజెక్ట్ 'వేదం' విషయంలో ఆయన ఎంపిక చేసుకున్న స్టార్ కాస్ట్ సంచలనాలైతే సృష్టించిందేమో కానీ ఆ చిత్రం ఏ దశలో ఉందనేది మాత్రం ప్రస్తుతం ఎవరికీ అంతుపట్టడం లేదు. తొలుత 'గమ్యం' తర్వాత అశ్వనీదత్ బ్యానర్ లో విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని క్రిష్ ప్లాన్ చేశారు. వివేకానందుని స్ఫూర్తితో 'కృష్ణ ముకుంద మురారి' అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే స్క్రిప్టు ప్రకారం సినిమా సెకెండాఫ్ లో వెంకటేష్ కొంత మార్పు చేయాలని కోరడం, క్రిష్ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి రాలేదు. దీంతో మళ్లీ ఓ చిన్న చిత్రంలో హిట్ కొట్టి తన సత్తా చాటాలనుకున్న క్రిష్ కొత్త తారలతో 'వేదం' చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అనూహ్యంగా కథ నచ్చి అల్లు అర్జున్, ఆయన సిఫారసుతో మంచు మనోజ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. అల్లు అర్జున్ నటిస్తున్నట్టు తెలిసి అనుష్క మరోమాటకు తావులేకుండా ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మల్టీస్టారర్ చిత్రాలకు 'వేదం' శ్రీకారం చుట్టనుందనే భారీ అంచనాలకు తావిచ్చింది. ప్రచారార్భాటాలకు దూరంగానే షూటింగ్ మొదలైంది. అప్పట్నించీ ఇంతవరకూ ఆ చిత్రం ప్రోగ్రస్ ఏమిటనేది సస్సెన్స్ గానే ఉంది. అయితే తాజాగా ఈ చిత్రంలోని కీలకమైన స్టార్ కాస్ట్ అంతా వివిధ ప్రాజెక్ట్ ల వైపు మళ్లడంతో 'వేదం' ఎందాక వచ్చిందనే విషయంలో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తున్నారు.
అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మార్చి నుంచి తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో 'బద్రీనాథ్'కు ఆయన రెడీ అవుతున్నారు. మంచు మనోజ్ ఈమధ్యనే 'బిందాస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా తొలి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అనుష్క సైతం 'పంచాక్షరి', మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల వైపు మళ్లింది. 'వేదం'తో ముడిపడిన కీలక స్టార్స్ అంతా ఇతర ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండటం వెనుక 'వేదం' పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమవుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం తెరకెక్కుతున్న తీరు సదరు నటీనటులకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిష్ 'మౌనవ్రతం' వీడుతారామో చూడాలి..
Be first to comment on this News / Article!
|