నాగచైతన్య 'ఏమాయ..' 26న
అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ ('ఘర్షణ' ఫేమ్) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'ఏ మాయ చేసావె'. సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
నాగచైతన్య మాట్లాడుతూ, ఇదొక అందమైన ప్రేమకథా చిత్రమనీ, ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుందనీ చెప్పారు. గౌతమ్ మీనన్ తనకెంతో ఇష్టమైన దర్శకుడనీ, ఆయనతో పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందనీ అన్నారు. అలాగే ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన ఆడియో చాలా పెద్ద హిట్ అయిందనీ, ఇదే తరహాలో సినిమాను కూడా ప్రేక్షకాభిమానులు హిట్ చేస్తారని ఆశిస్తున్నాననీ అన్నారు. సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ, ఈ క్యూట్ లవ్ స్టోరీకి రెహ్మాన్ సంగీతం ఎంతో తోడైందనీ, ఆడియో పెద్ద సక్సెస్ సాధించి ప్రతిచోటా పాటలు వినిపిస్తున్నాయనీ అన్నారు. ఈనెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈచిత్రం తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా సమంత (తొలి పరిచయం) నటించగా, ఇతర పాత్రల్లో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లక్ష్మి, సంజయ్ స్వరూప్, సుధీర్, త్రిష అలెక్స్ నటించారు. అనంత్ శ్రీరామ్ పాటలు, ఉమర్జీ అనూరాధ మాటలు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, రాజీవన్ ఆర్ట్, సెల్వ ఫైట్స్, ఫ్లెక్లి (లండన్), కార్ల్ లాన్ షన్ (యుఎస్ఎ) కొరియోగ్రఫీ అందించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|