'లీడర్'తో గ్రేట్ ఎంట్రీ: రానా
తొలి సినిమా ఒక రెస్పాన్సిబులిటీ ఉండే పాత్ర పోషించాలనుకున్నప్పడు 'లీడర్' కథ విని ఎంతో ఇన్ స్పైర్ అయ్యాననీ, తాను ఎదురు చూస్తున్న కథ ఇదే అనిపించిందనీ ఆ చిత్ర కథానాయకుడు రానా తెలిపారు. ఎవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రానా తొలిసారి కథానాయకుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈనెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ లోని స్పిరిట్ టవర్స్ లో రానా, చిత్ర కథానాయిక రిచా గంగోపాథ్యాయ్, నటుడు సుబ్బరాజు చిత్ర విశేషాలను తెలిపారు.
రానా మాట్లాడుతూ, ఇంతవరకూ ప్రేమకథా చిత్రాలు తీసిన శేఖర్ కమ్ములకు ఇది వైవిధ్యమైన చిత్రమనీ, ఆయన ఎంతో నిజాయితీ గల దర్శకుడనీ, ఆయన గత చిత్రాలు ఇందుకు నిదర్శనమనీ అన్నారు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గ్రేట్ లీడర్స్ గురించి తెలుసుకున్నామనీ, గత ఐదు దశాబ్దాలలో ఆ స్థాయికి చేరిన లీడర్ దొరకలేదనీ అభిప్రాయపడ్డారు. మంచి నాయకుడు ఎలా ఉండాలనేది ఈ చిత్రంలో చెబుతున్నామనీ, రాజకీయం అంటే రెస్పాన్సిబులిటీ అని చెప్పే ప్రయత్నం చేసామనీ అన్నారు. ఇది ఒక పొలిటికల్ చిత్రమే అయినా ఇందులో ఆసక్తికరమైన ప్రేమ కథ, పొలిటికల్ డ్రామా మిళితమై ఉంటాయన్నారు. శివాజీ గణేషన్, కమల్ హాసన్ వంటి నటిదిగ్గజాలను పరిశ్రమకు అందించిన ఏవియం సంస్థ నుంచి తాను కూడా పరిచయం అవుతుండటం గర్వంగా ఉందని అన్నారు. శేఖర్ కమ్ముల తనను దృష్టిలో పెట్టుకుని కథ రాయలేదనీ, నిజానికి కథే హీరో అనీ, ఇందులో నేను ఓ పాత్ర మాత్రమే చేశాననీ అన్నారు. మిక్కీ జె.మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని అన్నారు. ఇందులో తన పాత్రకూ వై.ఎస్.జగన్ కూ ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక పొల్టీషియన్ కూతురిగా, ఒక జర్నలిస్టుగా ఇందులో నటించినట్టు రిచా తెలిపారు. రామానాయుడు గారు ఈ సినిమా చూసి ఆనంద భాష్పాలు రాల్చారనీ, సినిమా ఎంత బాగా వచ్చిందనడానికి ఇది నిదర్శనమని నటుడు సుబ్బరాజు తెలిపారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|