ఉలిక్కిపడుతున్న మనోజ్
ఊహించని సక్సెస్ వచ్చినప్పుడు గట్టిగా గిల్లుకోవడం, ఉలిక్కిపడటం ఎవరికైనా సహజం. మంచు మనోజ్ ఇప్పుడు 'బిందాస్' తెచ్చిన తొలి విజయంతో ఇలాగే ఉలిక్కిపడుతున్నారు. మనోజ్ 'దొంగ-దొంగది' నుంచి 'రాజుభాయ్' వరకూ వరుస ఫెయిలూర్లు చవిచూసి ఇటీవలే రూటు మార్చి 'నేను మీకు తెలుసా', 'ప్రయాణం' చిత్రాలతో తనలోని వైవిధ్యమైన నటుడిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆ రెండూ ా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో నిరాశపరచాయి. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోని మనోజ్ ఇప్పుడు 'బిందాస్'తో ఇటు క్లాస్, అటు మాస్ ను కూడా మెప్పించి బాక్సాఫీస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కథ వినగానే సినిమా విజయవంతం అవుతుందనుకున్నప్పటికీ ఇంత మంచి విజయం వస్తుందని అనుకోలేదనీ, 'బిందాస్' రెట్టింపు హుషారును తీసుకువచ్చిందనీ మనోజ్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. చెన్నైలోని తన మిత్రులకు బిందాస్ పార్టీ కూడా ఇవ్వబోతున్నారట. పనిలో పనిగా కె.రాఘువేంద్రరావు దర్శకత్వంలో తన సోదరి లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న చిత్రంలోనూ, క్రిష్ దర్శకత్వంలో 'వేదం' చిత్రాలపైనా మంచి ఆశలే పెట్టుకున్నారు. వీటికి తోడు మరో కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడానట.
మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు 'ఊ కొడతారా...ఉలిక్కిపడతారా' అనే టైటిల్ ను నిశ్చయించారు. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ శిష్యుడు రాజా దర్శకుడిగా పరిచయం కానున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోంది. మనోజ్ ఎంచుకుంటున్న చిత్రాలు చూస్తుంటే భవిష్యత్ లో మరిన్ని విజయాలు ఖాయమనే తోస్తుంది...
Read 1 Comment(s) posted so far on this News / Article!
|